NTV Telugu Site icon

Bandi Sanjay Resign: బీజేపీ రాష్ట్రాధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా.. సోషల్ మీడియాలో ఫోర్జరీ లేఖ

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay Resign: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవికి బండి సంజయ్ రాజీనామా చేసినట్టుగా ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్టోబర్ 31వ తేదీనే రాసినట్లుగా ఉన్న ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ప్రచారంలో ఉన్న లేఖపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. దొంగ పాస్ పోర్టులు తయారు చేసిన వాడికి ఫోర్జరీ లేఖలు సృష్టించడం కష్టం కాదంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లు ఫామ్‌హౌస్ డ్రామా ఫ్లాప్ కావడంతో టీఆర్ఎస్ మోసగాళ్లు ఇప్పుడు ఫోర్జరీ లేఖను రిలీజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతమంది ఎన్ని చేసినా మునుగోడులో బీజేపీ రికార్డు విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతో టీఆర్ఎస్ చేస్తున్న అబద్దాల ప్రచారాలు నవంబర్ 3తో ముగింపు అన్నారు. ఇది కేసీఆర్ ప్రజా జీవితానికి నిజమైన రాజీనామాకు దారి తీస్తుందని జోస్యం పలికారు. ఈ మేరకు బండి సంజయ్ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు.

Read Also: Phone to MLA Please Resign: రాజీనామా చేయి సార్.. మేం అభివృద్ధి చెందుతాం

ఇదిలా ఉంటే.. బండి సంజయ్ రాజీనామా పేరుతో ఫోర్జరీ లేఖను సృష్టించిన వారిపై ఎన్నికల సంఘానికి, పోలీసులుకు బుధవారం ఫిర్యాదు చేయనున్నట్టుగా బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇక, ఫోర్జరీ లేఖలో.. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నారని.. అయినా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొవాల్సి వస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు బండి సంజయ్ సమాచారం ఇచ్చినట్టుగా ఉంది. ఎన్నికల ఫలితాలు మనకు అనుకూలంగా లేనందున మునుగోడు నియోజకవర్గంలో ప్రచారానికి దూరంగా ఉండాలని అన్ని కేంద్ర నాయకత్వాలకు సూచించానని చెప్పినట్టుగా ఉంది. మునుగోడులో పార్టీకి ఓటమి ఎదురు కానుందని.. అందుకు బాధ్యత తనదేనంటూ బండి సంజయ్ వివరిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.