NTV Telugu Site icon

Bandi Sanjay : సుప్రీంకోర్టు తీర్పు అత్యంత బాధాకరం.. సుప్రీం తీర్పుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలకులే కారణం

Sanjay Bandi

Sanjay Bandi

Bandi Sanjay : జేఎన్జే జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన ఇండ్ల స్థలాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడం అత్యంత బాధాకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును గౌరవించాచాల్సిందే. అయితే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు దక్కకపోవడానికి పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతోపాటు ప్రస్తుత కాంగ్రెస్ పాలకులే ప్రధాన కారణం. 17 ఏళ్ల క్రితం పుస్తెలు తాకట్టు పెట్టి, అప్పు చేసి ఒక్కో జర్నలిస్టు రూ.2 లక్షల చొప్పున రూ.12 కోట్లు పోగు చేసి ప్రభుత్వానికి చెల్లించి జేఎన్జే హౌజింగ్ సొసైటీ పేరుతో స్థలాలు దక్కించుకున్నారు. నాటి నుండి నేటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఏదో ఒకసాకు చూపుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు చేతికి అందించకుండా తీవ్రమైన అన్యాయం చేశాయి. కేసీఆర్ పాలనలో జర్నలిస్టుల బతుకులు మరీ దుర్భరం. ఇండ్ల స్థలాలడిగితే లాఠీలతో కొట్టించారు. ప్రశ్నించే జర్నలిస్టులను వ్రుత్తిలో కొనసాగకుండా అడుగడుగునా అవమానించిన ఘటనలు కోకొల్లలు.

నేటి సుప్రీంకోర్టు తీర్పు బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలకుల నిర్వాక, నిర్లక్ష్య ఫలితమే. ఈ రెండు పార్టీలు జర్నలిస్టులను రోడ్డు పాల్జేయడమే కాకుండా చేతికొస్తుందని వేయికళ్లతో ఎదురు చూసిన ఇండ్ల స్థలాలను చేతికి అందకుండా చేశాయి. జర్నలిస్టుల నోటికాడ ముద్దను లాగేసుకున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో జర్నలిస్టు కుటుంబాల బాధ వర్ణణాతీతం. అసలు జర్నలిస్టుల చేసిన తప్పేమిటి? ఈ రెండు పార్టీలకు జర్నలిస్టులపై ఎందుకంత కక్ష? పైసాపైసా కూడబెట్టి డబ్బులు చెల్లించినా ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా 17 ఏళ్లు జాప్యం చేస్తారా?

Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్ ను వీడిన పంత్.. 9ఏళ్ల ప్రయాణంపై ఎమోషనల్‌ పోస్టు (వీడియో)

నేటి సమాజంలో జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివి. చాలీచాలని జీతాలతో బతుకీడుస్తున్నారు. అయినా తమ వార్తలతో నిరంతరం సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు అహర్నిశలు తపన పడతున్నారు. ప్రభుత్వం వాళ్లకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా అన్యాయం చేస్తోంది. వాళ్లకు హెల్త్ కార్డులు కూడా పనిచేయడం లేదు. ఉండటానికి ఇండ్లు లేక అద్దె కట్టలేక, పిల్లలు ఫీజులు కూడా చెల్లించే స్థోమత లేక తీవ్రమైన ఆర్దిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా కుటుంబం కంటే సమాజాన్ని చైతన్యవంతం చేయడమే ప్రధానమని నమ్మి జర్నలిజం వ్రుత్తిలో కొనసాగుతున్నారు. ఇండ్ల స్థలాల కోసం ఎదురుచూసి ఎంతోమంది జర్నలిస్టులు అసువులు బాశారు. జర్నలిస్టులను ఆదుకోవడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా విఫలమైనాయి.

ఇకనైనా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో క్రుషి చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు బాధాకరమే అయినప్పటికీ ప్రభుత్వం తనకున్న విచక్షణ అధికారాలను ఉపయోగించి జర్నలిస్టులకు ఇండ్లను కేటాయించాలి. అట్లాగే గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఇండ్లులేని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలను వెంటనే మంజూరు చేయాలి. ఈ విషయంలో ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ పక్షాన పూర్తిగా సహకరించేందుకు సిద్ధం. అట్లాకాకుండా ఇండ్ల స్థలాలివ్వకుండా జర్నలిస్టులకు అన్యాయం చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. జర్నలిస్టులతో కలిసి మహోద్యమానికి కార్యాచరణ రూపొందిస్తాం. బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పట్టిస్తాం. అదే సమయంలో జర్నలిస్టులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ లోని జేఎన్జే హౌసింగ్ సొసైటీ జర్నలిస్టులతోపాటు రాష్ట్రంలోని అర్హులైన విలేకరులందరికీ ఇండ్లను కేటాయిస్తాం.’ అని బండి సంజయ్ తెలిపారు.

IPL Auction 2025: ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు ఎవరంటే..?