NTV Telugu Site icon

Bandi Sanjay: ఎన్నికల కోడ్ ముగిసేలోపు నేతన్నల డిమాండ్లన్నీ పరిష్కరించాల్సిందే..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం చాలా సంతోషమని.. వస్త్ర పరిశ్రమ ఆసాములు, నేతన్నలంతా ఐక్యంగా చేసిన పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిసేలోపు నేతన్నల డిమాండ్లన్నీ పరిష్కరించాల్సిందేనని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సర్కార్ మెడలు వంచైనా హామీలను అమలు చేయిస్తామన్నారు. అవసరమైతే ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే దీక్షకు వెనుకాడబోమన్నారు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని కొనసాగించాలన్నారు. నేతన్న బీమా పథకం వయోపరిమితిని పెంచాలని పేర్కొన్నారు. ఈ విషయంలో నేతన్నలకు అండగా నిలిచిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.

Read Also: Political Panchangam: ఏ పార్టీ పంచాంగం వారిదే.. రాజకీయ పార్టీల ఉగాది వేడుకల్లో ఏం చెప్పారంటే?

ఇచ్చిన మాటకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ప్రభుత్వం బతుకమ్మ చీరల ఉత్పత్తికి సంబంధించి రావలసిన పాత బకాయిలు 270 కోట్ల రూపాయలను చెల్లించాలని బండి సంజయ్‌ కోరారు. అట్లాగే వస్త్ర పరిశ్రమ యధావిధిగా కార్యకలాపాలు నిర్వహించేందుకు కొత్త ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీటితోపాటు విద్యుత్ బిల్లులపై 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని, 10 శాతం యార్న్ సబ్సిడీని వెంటనే అందించాలని కోరారు. అట్లాగే నేత కార్మికుడిని ఆసామి చేయాలనే సంకల్పంతో గత ప్రభుత్వం రూ.370 కోట్ల వ్యయంతో ప్రవేశపెట్టిన ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని కొనసాగించడంతోపాటు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభ నివారణకు, నేతన్నల అభ్యున్నతికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

Read Also: Komatireddy Venkat Reddy: ప్రజాప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు రానివ్వం..

నిన్న రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలకు ఇచ్చిన హామీలన్నీ ఎన్నికల కోడ్ ముగిసేలోపే అమలు చేసి తీరాలన్నారు. అట్లాగాకుండా 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన విధంగా ఎన్నికల్లో పబ్బం గడుపుకునేందుకు దొంగ హామీలిచ్చి నేతన్నలను మోసం చేయాలనుకుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదన్నారు. అదే జరిగితే ఎన్నికల కోడ్ ముగిసిన మరుక్షణమే సిరిసిల్లలో ఎంపీగా ప్రమాణం చేయకముందే దీక్ష చేసేందుకు సిద్దంగా ఉన్నామని హెచ్చరించారు. నేతన్నలకు అండగా పోరాటాన్ని ఉద్ధృతం చేసి రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచేందుకు వెనుకాడేది లేదని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నామన్నారు. అట్లాగే చేనేత మిత్ర కింద ప్రతి మగ్గంపై పనిచేసే కార్మికుడికి నెలకు 2 వేల రూపాయల నూలు రాయితీ అందుతున్నా అవి ఏమాత్రం సరిపోవడం లేదని నేతన్నలు చెబుతున్నారన్నారు. . ఈ విషయంలో వారి పక్షాన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు.