రైతు మల్లికార్జున రెడ్డి చేస్తున్న ప్రకృతి వ్యవసాయం అందరికీ ఆదర్శమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలేసి ప్రకృతి వ్యవసాయం చేస్తూ పంట దిగుబడి రెట్టింపు చేసి లాభాలు ఆర్జించడమే కాకుండా పర్యావరణాన్ని, మనుషుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు క్రుషి చేస్తున్నారని పేర్కొన్నారు. రసాయన ఎరువులు వాడే రైతాంగంతోపాటు నేటి యువత మల్లికార్జున రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా బండి సంజయ్ కుమార్ చొప్పదండిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొప్పదండి నియోజకవర్గంలోని పెద్దకుర్మపల్లి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు మల్లికార్జునరెడ్డి తో మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన సంజయ్ అనంతరం మల్లికార్జునరెడ్డికి అభినందనలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు.
‘‘ప్రకృతి వ్యవసాయంతో మల్లికార్జున రెడ్డి సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారు. ఎందుకంటే వ్యవసాయ దిగుబడి (పంట ఉత్పత్తి) పెంచుకోవడానికి రైతులు యూరియా, డీఏపీ వంటి రసాయన ఎరువులు వాడటంవల్ల వాటిని తినడంవల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. పర్యావరణం కలుషితమవుతోంది. రసాయన ఎరువులతో పనిలేకుండా ప్రకృతి వ్యవసాయంతో పంట దిగుబడి రెట్టింపు ఏ విధంగా చేయొచ్చో మల్లికార్జున రెడ్డి నిరూపించారు.’’అని కొనియాడారు. ‘‘వ్యవసాయమంటే పొలానికే పరిమితం కాకుండా ఆవులు, మేకలు, కోళ్లు, చేపలను కూడా పెంచుతూ మల్లికార్జునరెడ్డి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఆవు పేడ, గోమూత్రాన్ని ఎరువులుగా వినియోగిస్తూ యూరియాతో పనిలేకుండా పంట దిగబడి పెంచుకుంటున్నారు. తద్వారా పర్యావరణాన్ని కాపాడుతున్నారు.’’అని పేర్కొన్నారు.