Bandi Sanjay : మొయినాబాద్ ఫాంహౌస్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే.. సీబీఐ విచారణకు నిరాకరించిన న్యాయస్థానం సిట్ దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. అదే సమయంలో సీఎం కేసీఆర్ మీడియా ముందు కేసుకు సంబంధించిన వీడియోలను బహిర్గతం చేయడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అయితే.. తాజాగా హైకోర్టు ఆదేశాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పందిస్తూ.. 4గురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ చేపట్టాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమన్నారు. అంతేకాకుండా.. సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలన్నదే బీజేపీ అభిప్రాయమన్నారు.
Also Read : MLAs Poaching Case : హైకోర్టు కీలక ఆదేశాలు.. సీబీఐ నో.. సిట్ దర్యాప్తుని కొనసాగించాలి
గౌరవ హైకోర్టు ఉత్తర్వులతో విచారణ పారదర్శకంగా జరిగే అవకాశముందని, బీజేపీ ప్రతిష్టను దెబ్బతీయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై ఆరోపణలు చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించడమే ఇందుకు నిదర్శనమన్నారు. సీఎం ప్రెస్ మీట్ నిర్వహించడంపట్ల హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు అభినందనీయమన్న బండి సంజయ్.. సిట్ దర్యాప్తు పురోగతి వివరాలను బహిర్గతపర్చకూడదని, ఈనెల 29లోపు పురోగతి నివేదికను సీల్డ్ కవర్‌లో సింగిల్ జడ్జికి సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
Also Read : Krishna: సూపర్ స్టార్ కృష్ణ తీరని కోరికలు.. ఇన్ని ఉన్నాయా..?
తప్పు చేసినోళ్లకు, కుట్రదారులకు శిక్ష పడాల్సిందే. తెలంగాణ ప్రజలు కూడా కోరుకునేది ఇదే అని ఆయన వెల్లడించారు. గౌరవ హైకోర్టు ధర్మాసనం పట్ల మాకు నమ్మకం ఉందని, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనుక కుట్రదారులెవరన్నది తేలడంతోపాటు దోషులకు తగిన శిక్ష పడుతుందనే నమ్మకం మాకుందని బండి సంజయ్ అన్నారు.