VeeraSimha Reddy : నటసింహ నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’లోని ఫస్ట్ సింగిల్ ముహూర్త సమయానికి నవంబర్ 25 ఉదయం 10 గంటల 29 నిమిషాలకు అభిమానులను పలకరించింది. “రాజసం నీ ఇంటి పేరు… పౌరుషం నీ ఒంటి పేరు… నిన్ను తలచుకున్నవారు లేచి నుంచుని మొక్కుతారు…” అంటూ మొదలయ్యే ఈ పాట నందమూరి ఫ్యాన్స్ ను పులకింప చేసింది. ఎందుకంటే బాలయ్య ఫ్యాన్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకొనే రచయిత రామజోగయ్య శాస్త్రి పదాలు పలికించినట్టు కనిపిస్తోంది. అలాగే అందుకు తగ్గ బాణీలు సమకూర్చిన ఎస్. థమన్, పాటలోనూ చిందులేస్తూ కనిపించడం మరో విశేషం! ‘అఖండ’లో బాలకృష్ణ అభిమానులను పులకింప చేస్తూ “జై బాలయ్యా…జై జై బాలయ్యా…” అంటూ సాగే పాటతో అదరహో అనిపించారు థమన్. అదే తీరున ఇందులోనూ “జై బాలయ్యా… జై బాలయ్యా… జై జై బాలయ్యా…” అనీ గాయకుడు కరిముల్లా నోట పలికింప చేశారు. అందుకే అభిమానులు పులకించిపోతున్నారు. ఈ పాటను జనసమూహాల మధ్య, దేవాలయాల పరిసరాల్లో చిత్రీకరించడం మరింత శోభనిచ్చింది. ఈ పాటకు శంకర్ నృత్య దర్శకత్వం వహించారు.
Read Also: Thodelu Movie Review: తోడేలు రివ్యూ (హిందీ డబ్బింగ్)
ఈ ఫస్ట్ సింగిల్ ఆరంభంలోనే బాలకృష్ణ రథం లాగుతూ కనిపిస్తారు. ఆయనను చూసి జనం పాట పాడేలా చిత్రీకరించారు. జనంతో పాటు మధ్య మధ్యలో బాలయ్య సైతం స్టెప్స్ వేయడం అలరిస్తుంది. స్పాట్ షాట్స్ సైతం ఆకట్టుకుంటాయి. “అచ్చ తెలుగు పౌరుషాల రూపం నీవయ్యా… అలనాటి రాయలోరి తేజం నువ్వయ్యా… మా తెల్లవారే పొద్దు నువ్వై పుట్టినావయ్యా… మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా… జన్మబంధువంటూ నీకు జై కొట్టినామయ్యా…” అంటూ తరువాత పాట హుషారెక్కిస్తుంది. ఆపై “జై బాలయ్యా…జై బాలయ్యా… జై జై బాలయ్యా…” అంటూ మరింత ఉత్సాహం కలిగించేలా రామజోగయ్య కలం సాగిందని చెప్పవచ్చు. “మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా…” అనీ మరింతగా మురిపించారు.
Read Also: Minister KTR: శిల్పా లేఔట్ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
పాట చూస్తోంటే బాలయ్యకు ఉన్న ‘మేన్ ఆఫ్ మాసెస్’ అనే ఇమేజ్ కు తగ్గట్టుగా చిత్రీకరించినట్టు కనిపిస్తోంది. సంక్రాంతి కానుకగా రానున్న ఈ చిత్రాన్ని గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. పాటలో పదాల జాతరకు తగ్గట్టుగానే చిత్రీకరణలోనూ జాతర చూపించారు మలినేని గోపీచంద్. ఆయన దర్శకత్వానికి తగ్గట్టుగా రిషి పంజాబీ కెమెరా పనితనం సైతం కనువిందు చేస్తుంది. అలా విడుదలయిందో లేదో ఇలా ఈ పాటను అభిమానులు విశేషంగా చూస్తున్నారు. మరి సినిమా వారిని ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.