UP: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో ఒక భయంకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే ఇంట్లో ఆరుగురు మృతదేహాలు లభ్యం కావడం ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. నిండూర్ పూర్వా గ్రామంలో పాక్షికంగా కాలిపోయిన ఇంట్లో ఆరుగురు వ్యక్తుల కాలిపోయిన మృతదేహాలు కనిపించాయి. సీనియర్ జిల్లా పోలీసులు, పరిపాలనా అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శాఖ బృందం మంటలను అదుపులోకి తెచ్చింది. పోలీసులు అన్ని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపారు.
READ MORE: DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగ కానుక.. పెరుగనున్న డీఏ..
మృతదేహాల్లో ఇంటి యజమాని విజయ్, అతని ఇద్దరు కుమార్తెలు, భార్య, మరో ఇద్దరు ఉన్నారు. ఈ ఘటన వినగానే జనసమూహం భారీగా గుమిగూడారు. కుటుంబీకులను మొత్తం హత్య చేసి, ఆపై ఇంటికి నిప్పంటించారని స్థానికులు అనుమానిస్తున్నారు. మరణానికి కారణం ఇంకా తెలియలేదు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో పూజ జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, అందులో పాల్గొన్న వారందరూ మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎటువంటి నిర్ధారణలకు రావడం లేదు. పోలీసులు ఇతర కుటుంబ సభ్యులను, పొరుగువారిని ప్రశ్నిస్తున్నారు.