NTV Telugu Site icon

Babar Azam Captaincy: బాబర్‌ ఆజం కెప్టెన్సీ ఊడుతుందా?.. పాక్‌ క్రికెట్‌ బోర్డు కీలక ప్రకటన

Babar Azam

Babar Azam

Babar Azam Captaincy: భారత్‌లో జరుగుతున్న ఐసీసీ వరల్డ్‌ కప్‌ టోర్నమెంట్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకోవడంలో జట్టు విఫలమైతే బాబర్ అజామ్ కెప్టెన్సీకి ప్రమాదం వాటిల్లుతుందని సూచిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఒక విచిత్రమైన ప్రకటనను విడుదల చేసింది. పాకిస్థాన్ క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ 2023లో ఇండియా, ఆస్ట్రేలియ, అఫ్గానిస్తాన్‌లతో వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది. ఇండియా చేతుల్లో ఓటమితోనే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కెప్టెన్ బాబర్ ఆజం.. అఫ్గానిస్తాన్‌తో ఓటమి తర్వాత మరింత ఒత్తిడిలో పడిపోయాడు. మాజీ క్రికెటర్లు, అక్కడి మీడియా అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. అంతేకాదు ఓ ప్రకటన కూడా జారీ చేసింది. ఈ సమయంలో జట్టుకు మద్దతుగా నిలవాలని అభిమానులను కోరుతూనే.. బాబర్ ఆజంకు ఓ వార్నింగ్ కూడా ఇచ్చింది. కెప్టెన్ బాబర్, చీఫ్ సెలక్టర్ ఇంజమామ్-ఉల్-హక్‌లకు ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసే స్వేచ్ఛ ఇచ్చామని పీసీబీ స్పష్టం చేసింది.

Also Read: PM Modi: షిర్డీలోని సాయిబాబా సమాధి ఆలయంలో ప్రధాని మోడీ ప్రార్థనలు

“కెప్టెన్ బాబర్ ఆజం, టీమ్ మేనేజ్‌మెంట్ పై మీడియా స్క్రూటినీని ఉద్దేశించి ఈ ప్రకటన జారీ చేస్తున్నాం. ఆటలో గెలుపోటములు సహజమన్న మాజీ క్రికెటర్ల మాటతో ఏకీభవిస్తున్నాం. వరల్డ్ కప్ 2023 టీమ్ ఎంపిక కోసం కెప్టెన్ బాబర్ ఆజం, చీఫ్ సెలక్టర్ ఇంజమాముల్ హక్‌లకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. వరల్డ్ కప్ లో టీమ్ ప్రదర్శన చూసిన తర్వాత పాకిస్థాన్ క్రికెట్ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం. ఇప్పుడైతే అందరూ టీమ్‌కు అండగా నిలవండి. వాళ్లు ఈ మెగా ఈవెంట్లో మళ్లీ గాడిలో పడటానికి ప్రయత్నిస్తున్నారు” అని పీసీబీ ఆ ప్రకటనలో వెల్లడించింది. రల్డ్ కప్ లో ప్రస్తుతం పాకిస్థాన్ టీమ్ సెమీఫైనల్ చేరితేనే బాబర్ కెప్టెన్సీ ఉంటుందని, లేదంటే అతడు కేవలం టెస్ట్ క్రికెట్‌కే పరిమితమవుతాడని పీసీబీ వర్గాలు తెలిపాయి.

శుక్రవారం చెన్నైలో దక్షిణాఫ్రికాతో చెన్నైలో పాకిస్తాన్ తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌ను ఎదుర్కొంటోంది. ఐదు మ్యాచ్‌లలో వరుసగా మూడు ఓటములను చవిచూసినందున, సెమీఫైనల్‌కు చేరుకునే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. పాక్‌ జట్టు ఇంకా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే అవన్నీ చాలా స్ట్రాంగ్‌ టీమ్స్‌ కావడంతో పాక్‌ సెమీస్‌ చేరడం అంత తేలికైన విషయం కాదు. ప్రపంచకప్ ముగిసిన వెంటనే పాకిస్థాన్ ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. జట్టు 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కూడా ప్లాన్ చేయాలి.