ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’కు ఇటీవల భారత జట్టులోని కొందరు ఆటగాళ్లు వెళ్లిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం జరిగిన ఈ షోకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్‌లు హాజరయ్యారు. షోలో అందరూ తమ సహచరులు, టీమ్ గురించి చాలా విషయాలు పంచుకున్నారు. ఫాస్ట్ బౌలర్, హైదరాబాద్ గల్లీ బాయ్ మహమ్మద్ సిరాజ్‌కు సంబంధించిన ఓ ఫన్నీ ఘటనను అక్షర్ అభిమానులతో పంచుకున్నాడు.
నా ఇంగ్లిష్ అయిపోయిందంటూ.. మహమ్మద్ సిరాజ్ ఇంటర్వ్యూ మధ్యలోనే బయటకు పరిగెత్తాడని అక్షర్ పటేల్ చెప్పాడు. ‘టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం టీమిండియా ఆటగాళ్లతో దినేశ్ కార్తిక్ ఇంటర్య్వూ తీసుకున్నాడు. జట్టులోని అందరికీ ఇంగ్లీష్ బాగా వచ్చు, మనల్నే ఎందుకు ఒక్కడ ఉంచాడో అర్థం కావడం లేదని సిరాజ్ నాతో (హిందీలో) అన్నాడు. నేను ఇంగ్లిష్‌లో ఏదో మాట్లాడేశా. ఏం మాట్లాడానో గుర్తులేదు. సిరాజ్ మాత్రం ఇంటర్వ్యూ మధ్యలోనే పారిపోయాడు. తాను చెప్పాలనుకున్నది వచ్చిన ఇంగ్లిష్‌లో మాట్లాడాడు. నా ఇంటర్వ్యూ ముగిసిందని బయటకు వచ్చేశాడు’ అని అక్షర్ తెలిపాడు.
Also Read: Mayank Yadav: నువ్వేం ప్రత్యేకంగా చెయ్యొద్దన్నాడు.. అసలు విషయం చెప్పిన మయాంక్ యాదవ్!
టీ20 వరల్డ్‌కప్ 2024 గెలిచి టీమ్ అంతా హ్యాపీగా సంబరాలు చేసుకుంటుండగా.. మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ మాత్రం ఇంటర్వ్యూతో బిజీగా ఉన్నారు. సరదా కోసమే సిరాజ్‌ను దినేశ్ కార్తిక్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశాడు. యూఎస్ఏ, విండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన వరల్డ్‌కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించింది. దాంతో భారత్ ఖాతాలో రెండో పొట్టి కప్ చేరింది.