Quad Summit: దేశీయ సమస్యల కారణంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పర్యటనను వాయిదా వేసుకోవడంతో వచ్చే వారం సిడ్నీలో జరగాల్సిన క్వాడ్ సమ్మిట్‌ను ఆస్ట్రేలియా బుధవారం రద్దు చేసింది. రుణ గరిష్ఠ పరిమితిపై యూఎస్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న చర్చల మధ్య బైడెన్ ఆస్ట్రేలియా, పాపువా న్యూ గినియా పర్యటనలను రద్దు చేసుకున్నారు. అయితే ఈ వారాంతంలో జరిగే జీ7 సదస్సుకు ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. జపాన్‌లో జరిగే జీ7 శిఖరాగ్ర సమావేశంలో భారత్, జపాన్, యూఎస్ నాయకులను కలుస్తానని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ చెప్పినట్లు సమాచారం. “వచ్చే వారం సిడ్నీలో క్వాడ్ నాయకుల సమావేశం జరగదు. అయితే జపాన్‌లోనే క్వాడ్ నాయకులతో చర్చిస్తాము” అని ఆస్ట్రేలియా ప్రధాని విలేకరులతో అన్నారు.
Read Also: 100Hours Of Cooking : ఆడవాళ్లలో ఆణిముత్యానివి తల్లి.. 100గంటలు వంట చేశావా?
2017లో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రభావానికి ప్రతిస్పందనగా యూఎస్, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియాలు క్వాడ్ లేదా చతుర్భుజ కూటమిని ఏర్పాటు చేశాయి. కెనడా, యూకే, యూఎస్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్.. ఏడు దేశాలు సభ్యులుగా గల జీ7 గ్రూప్‌లో భారతదేశం, ఆస్ట్రేలియా సభ్యులు కాదు. అయితే మే 19 నుంచి మే 21 వరకు జపాన్‌లోని హిరోషిమాలో జరిగే జీ7 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని వారిని ఆహ్వానించారు. “G7కి హాజరు కావాల్సిందిగా నన్ను ఆహ్వానించినందుకు (జపనీస్) ప్రధాన మంత్రి (Fumio) కిషిడాకు ధన్యవాదాలు. మనం మాట్లాడుకోవడం సముచితం” అని ఆంథోనీ అల్బనీస్ అన్నారు. ఆస్ట్రేలియన్ ప్రధాన మంత్రి తాను ముందు రోజు జో బైడెన్‌తో మాట్లాడానని, ఇప్పుడు రద్దు చేయబడిన క్వాడ్ సమ్మిట్‌కు హాజరు కాలేకపోయినందుకు తన నిరాశను వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. సిడ్నీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక కార్యక్రమం వచ్చే వారంలో కొనసాగుతుందని ఆయన అన్నారు.