జనసేన పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తూగో జిల్లా సినీ డిస్ట్రిబ్యూటర్, అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత అత్తి సత్యనారాయణ రాజమండ్రిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, ఇదంతా దిల్ రాజు కుట్రలో భాగమని ఆరోపించారు. సినిమా థియేటర్ల బంద్ విషయంలో తన పేరును దురుద్దేశంతో లాగారని, ఈ వివాదం వెనుక దిల్ రాజు, అతని సోదరుడు శిరీష్ రెడ్డి, సురేష్ బాబు, సునీల్ నారంగ్‌లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
ALso Read: Pawan Kalyan : ‘OG’ మూవీలో మరో హీరోయిన్..!
అత్తి సత్యనారాయణ తన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన వార్నింగ్‌ల కారణంగానే దిల్ రాజు తన పేరును జనసేనతో జోడించి మాట్లాడినట్లు ఆరోపించారు. “దిల్ రాజు తన తమ్ముడు శిరీష్ రెడ్డిని కాపాడుకోవడానికి నా పేరును బంద్ వివాదంలోకి లాగారు. నేనెక్కడా థియేటర్ల బంద్ గురించి ప్రస్తావించలేదు. ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సినిమాలు లేకపోతే థియేటర్లు మూసివేయాల్సి వస్తుందని మాత్రమే చెప్పాను,” అని సత్యనారాయణ స్పష్టం చేశారు.
జూన్ 1న థియేటర్ల బంద్ ప్రకటన చేసింది దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి అని, అయితే దిల్ రాజు తన సోదరుడిని కాపాడుకోవడానికి తనపై అబద్ధపు ఆరోపణలు చేశారని ఆరోపించారు. “దిల్ రాజు కమల్ హాసన్‌ను మించి ఆస్కార్ రేంజ్‌లో నటించారు. నా రాజకీయ భవిష్యత్తుపై దెబ్బ కొట్టారు. ఈ విషయంలో నేను కోర్టుకు వెళ్తాను,” అని ఆయన పేర్కొన్నారు.
ALso Read:Manchu Vishnu: సుప్రీమ్ కోర్టుకు మంచు విష్ణు
థియేటర్ల బంద్ కుట్ర వెనుక దిల్ రాజు, శిరీష్ రెడ్డి, సురేష్ బాబు, సునీల్ నారంగ్ అనే నలుగురు ఉన్నారని ఆయన ఆరోపించారు. “ఈ నలుగురు కలిసి ఈ కుట్రను రచించారు. పవన్ కల్యాణ్ వీరి తొక్క తోలు తీసేస్తారు,” అని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా, తాను జనసేన పార్టీకి విధేయుడిగా ఉంటూ, తన ప్రాణం ఉన్నంత వరకూ పవన్ కల్యాణ్‌తోనే ఉంటానని స్పష్టం చేశారు. తన బహిష్కరణ గురించి మాట్లాడుతూ ఈ వివాదం సినిమా వ్యవహారాలకు సంబంధించినదని, జనసేన పార్టీ తనను అర్థం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. “నా పార్టీ నాకు అగ్ని పరీక్ష పెట్టింది. కానీ, ఈ విషయం దిల్ రాజు కుట్ర అని నేను పార్టీకి వివరిస్తాను. రాజమండ్రి జనసైనికులు నా పరిస్థితి చూసి బాధపడుతున్నారు. ఈ విషయంలో నా పార్టీ నాకు న్యాయం చేస్తుందని నమ్ముతున్నాను,” అని ఆయన తెలిపారు.
