ABV ఫౌండేషన్ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకోపన్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ ఎంపి సభ్యులు సుధాన్ష్ త్రివేది హాజరయ్యారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వాజ్ పేయి స్ఫూర్తితో ఈ దేశ యువత ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. వాజ్ పేయి హైదరాబాద్‌కు వచ్చి వెళ్లే వరకు బాగోగులు చూసుకునే అదృష్టం తనకు దక్కిందని అన్నారు. వాజ్ పేయిని చాలా దగ్గర నుంచి చూశానని కిషన్ రెడ్డి చెప్పారు.
Read Also: America: క్రిస్మస్ వేళ అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు భారీ ఎదురుదెబ్బ.. అన్ని విమానాలు రద్దు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలకు వాజ్ పేయి వచ్చారు.. వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు యువ మోర్చా జాతీయ అధ్యక్షుడుగా ఉన్నానని కిషన్ రెడ్డి చెప్పారు. యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ప్రధాని వాజ్ పేయ్‌ని అనేకసార్లు కలిశానని పేర్కొన్నారు. వాజ్ పేయి ఉపన్యాసం కవితాత్మకంగా ఉండేదని తెలిపారు. నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి వాజ్ పేయి అని కిషన్ రెడ్డి తెలిపారు. నైతిక విలువలకు కట్టుబడిన వాజ్ పేయి ఒక్క ఓటుతో ప్రధాని పదవిని కోల్పోయారు.. అజాత శత్రువు అటల్ బిహారీ వాజ్ పేయి అన్నారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ పెరిగిందని కిషన్ రెడ్డి చెప్పారు.
Read Also: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?
వాజ్ పేయి జాతీయ రహదారుల రూపకల్పన చేశారు.. వాజ్ పేయ్ స్ఫూర్తితో అమెరికా రోడ్లను తలదన్నేలా మోడీ అభివృద్ది చేశారని కిషన్ రెడ్డి తెలిపారు. చిన్న రాష్ట్రాల ద్వారా వేగవంతమైన అభివృద్ది జరుగుతుందని విశ్వసించారు.. అందరి ఆమోదయోగ్యంతో మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేశారన్నారు. వాజ్ పేయి ఏర్పాటు చేసిన మూడు రాష్ట్రాల స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీ నుంచి లాహోర్ వరకు బస్సులో ప్రయాణించిన ఏకైక ప్రధాని వాజ్ పేయి అని.. తన జీవితాన్ని జాతీయ భావ సిద్ధాంతానికి అంకితం చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.