ఆసియా కప్ 2025లో భారత్ సూపర్-4కు చేరుకుంది. గ్రూప్-ఎ నుంచి సూపర్-4లో చోటు ఖాయమైంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్ 4 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. సోమవారం భారత్‌కు మ్యాచ్ లేదు కానీ.. ఒమన్‌ను యూఏఈ ఓడించడంతో టోర్నీలో సూపర్-4 చేరిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. మరోవైపు వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిన ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
గ్రూప్-ఎ నుంచి సూపర్-4కు అర్హత సాధించడానికి ఇంకా ఒక జట్టుకే అవకాశం ఉంది. బుధవారం (సెప్టెంబర్ 17) పాకిస్థాన్, యూఏఈ టీమ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు 4 పాయింట్లతో గ్రూప్-ఎ నుంచి రెండో సూపర్-4 బెర్తును కైవసం చేసుకుంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా లేదా టై అయినా.. రెండు జట్లకే చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు రెండు జట్ల ఖాతాలో 3 పాయింట్స్ ఉంటాయి. నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉన్న పాకిస్థాన్ అర్హత సాధిస్తుంది. శుక్రవారం తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఒమన్‌తో భారత్ తలపడనుంది.