సెప్టెంబర్ 28న దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ ఫైనల్ 2025లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం స్టేడియంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పీసీబీ చీఫ్, ఏసీసీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా ప్లేయర్స్ తిరస్కరించారు. దాంతో నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీతో పాటు భారత ఆటగాళ్లకు దక్కాల్సిన విజేత పతకాలను కూడా హాటల్‌కు తీసుకెళ్లిపోయాడు. దాంతో పీసీబీ, బీసీసీఐ మధ్య వివాదం చెలరేగింది.
పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ తీరుపై బీసీసీఐ గుర్రుగా ఉంది. ఆసియా కప్ ట్రోఫీని నఖ్వీ తనతో పాటు తీసుకెళ్లడంపై మంగళవారం జరిగిన ఏసీసీ ఏజీఎం సమావేశంలో బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏసీసీ సమావేశానికి వర్చువల్‌గా హాజరైన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా.. నఖ్వీపై ఫైర్ అయ్యారు. ట్రోఫీ ఏసీసీ సొత్తు ఏమీ కాదని, నఖ్వీది అయితే అస్సలు కాదని గుర్తు చేశారు. ట్రోఫీని వేంటనే భారత్‌కు అందించాలని డిమాండ్ చేశారు. ట్రోఫీ విషయంలో ఏసీసీ జోక్యం చేసుకోవాలని రాజీవ్ శుక్లా కోరారు.
ఆసియా కప్ ట్రోఫీని తన చేతుల మీదుగా స్వీకరించబోమని భారత ప్లేయర్స్ లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వలేదని సమావేశంలో ఏసీసీ ఛైర్మన్ చెప్పాడు. ట్రోఫీపై శుక్లా ప్రశ్నలు సాధించగా.. సమావేశంలో కాకుండా వేరే వేదికపై మాట్లాడుతా నఖ్వీ బదులిచ్చాడు. దాంతో శుక్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రోఫీని వెంటనే ఏసీసీ కార్యాలయంలో పెట్టాలని, అక్కడి నుంచి తాము తీసుకుంటామని శుక్లా స్పష్టం చేశారు. అందుకు అంగీకరించని నఖ్వీ.. ట్రోఫీ విషయంలో చర్చించాల్సిన అవసరముందన్నాడు. ట్రోఫీ తమదే అని, చర్చించడానికి ఇంకా ఏమీ లేదని శుక్లా అల్టిమేటం జారీ చేశారు. ఈ విషయంపై ఐసీసీకి ఫిర్యాదు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.
