మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అశోక్ చవాన్ ఈరోజు బీజేపీలో చేరారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మహారాష్ట్ర బీజేపీ కార్యాలయానికి చేరుకున్న ఆయన.. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. నిన్న కాంగ్రెస్ కు రాజీనామాతో పాటు అసెంబ్లీ సభ్యత్వానికి చవాన్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి బయటకు రావడం తన వ్యక్తిగత విషయమన్నారు. మరో రెండు రోజుల్లో తదుపరి నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు. ఈరోజు నుంచి తన రాజకీయ జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నానని అన్నారు.
Read Also: Dattajirao Gaekwad Dead: భారత క్రికెట్‌లో విషాదం.. మాజీ కెప్టెన్ కన్నుమూత!
దేశ్‌ముఖ్ రాజీనామా తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు
చవాన్ డిసెంబర్ 2008 నుండి నవంబర్ 2010 వరకు రెండుసార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. డిసెంబరు 2008లో ముంబై ఉగ్రదాడుల తర్వాత రెండుసార్లు సీఎంగా పనిచేసిన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌ను ఆ పదవి నుంచి తొలగించడంతో చవాన్‌ను ముఖ్యమంత్రి చేశారు. ఆ తర్వాత 2009 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఆయన్ను మళ్లీ సీఎం చేసింది. 2010లో కార్గిల్ అమరవీరుల వారసుల కోసం ముంబైలో నిర్మించిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలో బంధువులకు ఇళ్లు ఇవ్వడంపై చాలా దుమారం చెలరేగింది. ఈ గందరగోళం తర్వాత అశోక్ చవాన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
Read Also: Balakrishna Case: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ కేసులో మరో ట్విస్ట్..
అశోక్ చవాన్.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శంకర్‌రావ్ చవాన్ కుమారుడు. మహారాష్ట్ర చరిత్రలో తొలిసారిగా తండ్రీకొడుకులు ఇద్దరూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. నాందేడ్ నుంచి ఎంపీగా కూడా పనిచేశారు. మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆయన మహారాష్ట్రలోని సాంస్కృతిక శాఖ, పరిశ్రమలు, గనుల శాఖ వంటి బాధ్యతలను కూడా నిర్వహించారు.