ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్య నాథ్ పై విమర్శలు గుప్పించారు. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్, ప్రయాగ్ రాజ్, సహరాన్ పూర్ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాళ్ల దాడి, ఆస్తుల ధ్వంసం జరిగింది. దీంతో ఉత్తర్ ప్రదేశ్ లోని యోగీ సర్కార్ అల్లర్లను అణచివేయడంతో పాటు శాంతి భద్రతలకు భంగం కలిగించిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నాడు. ఇప్పటికే 337 మందిని అరెస్ట్ చేశారు. అల్లర్లలో ప్రధాన నిందితులుగా ఉన్న వారిని అక్రమ ఆస్తులను బుల్డోజర్లతో కూల్చి వేస్తున్నారు.
అయితే యోగీ ఆదిత్య నాథ్ బుల్డోజర్ల యాక్షన్ పై అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు గుప్పించారు. యూపీ సీఎం ‘ సూపర్ ఛీప్ జస్టిస్ ’గా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. యోగీ అతని సొంత కోర్టులో ఎవరినైనా దోషిగా నిర్ణయిస్తారంటూ విమర్శించారు. బుల్డోజర్లలో కూల్చిన అఫ్రీన్ ఫాతిమా ఇల్లు ఆమె తల్లిపేరుపై ఉందని అలాంటప్పుడు ఇళ్లును ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. బీజేపీ నేత కుమారుడు ఐదుగురిని చంపాడని ఆయన ఇంటిని బీజేపీ ఎందుకు కూల్చడం లేదని లఖీంపూర్ ఖేరీ ఘటనను ప్రస్తావించారు. భారతీయ ముస్లింలకు బీజేపీ సామూహిక శిక్ష విధిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు కూడా అసదుద్దీన్ యోగీపై విమర్శలు చేశారు. యూపీ సీఎం అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారని.. అతను ఎవరినైనా దోషిగా నిలబెట్టి వారి ఇళ్లను కూల్చేస్తాడా? అని ప్రశ్నించారు.
మోదీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే గత 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా..2024 ఎన్నికలు సమీపిస్తున్నందున 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటుందని అసద్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంలో 55 లక్షల ఖాళీలు ఉన్నాయని.. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం 10 లక్షల ఉద్యోగాలను మాత్రమే ఇస్తోందని విమర్శించారు.