Delhi Excise Policy Case: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు మరోసారి సమన్లు ఇచ్చారు. అయితే, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు ఇప్పటికే ఆరు సార్లు సమన్లు జారీ చేయగా, తాజాగా ఇచ్చిన నోటీసులతో కలిపి మొత్తం ఏడు సార్లు ఆయనకు సమన్లు జారీ చేశారు. ఇక, ఆయన ఒక్కసారి కూడా ఈడీ విచారణకు హాజరు కాలేదు.. దీంతో తాజాగా మరోసారి ఈడీ నోటీసులు పంపింది. ఫిబ్రవరి 26వ తేదీన ఈడీ ఏజెన్సీ కార్యాలయంలో విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాలని నోటీసుల్లో వెల్లడించింది.
Read Also: WhatsApp : వాట్సాప్ లో మరో ప్రైవసీ ఫీచర్.. అలాంటివి ఇకమీదట కుదరదు!
ఇక, గతంలో నవంబర్ 2న, డిసెంబర్ 21న, ఆ తర్వాత జనవరి 3న కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఆ తర్వాత జనవరి 13న నాలుగోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.. కానీ, ఈడీ నోటీసుల్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పెద్దగా పట్టించుకోలేదు.. దీంతో జనవరి 31, ఫిబ్రవరి 14వ తేదీన కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేసింది.. అయితే, అప్పుడు కూడా ఆయన విచారణకు హాజరుకాలేదన్నారు. పైగా ఈడీ నోటీసులు అక్రమమంటూ కొట్టిపారేశాడు. తనను అరెస్ట్ చేసే కుట్రలో భాగంగానే ఈడీ నోటీసులు పంపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏడోసారి ఈడీ సమన్లు జారీ చేసింది.. తాజా నోటీసులపై కేజ్రీవాల్ ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు.. ఇక, ఈసారైనా ఢిల్లీ సీఎం విచారణకు వెళ్తారో లేదా అనేది చూడాల్సిందే.