ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు 50 రోజుల తర్వాత భారీ ఊరట లభించింది. శుక్రవారం ఆయనకు దేశ సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించారు. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉందని.. న్యాయస్థానానికి కేజ్రీవాల్ విన్నవించుకున్నారు. మొత్తానికి కేజ్రీవాల్ అభ్యర్థనను మన్నించిన ధర్మాసనం.. జూన్ 1 వరకు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే ఢిల్లీలో ఆరు దశలో పోలింగ్ జరగనుంది. అనగా మే 25న ఓటింగ్ జరగనుంది. జైలు నుంచి విడుదల కాగానే ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చని ఆప్ నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆప్ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
ఇది కూడా చదవండి: SBI Jobs: ఎస్‌బీఐలో 12,000 ఉద్యోగాలు.. వివరాలు ఇలా..
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతించింది. అటు తర్వాత జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఏప్రిల్ 1న తీహార్ జైలుకు తరలించారు. తాజాగా ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 21 రోజులు కేజ్రీవాల్‌కు బెయిల్ లభించింది. జూన్ 2న లొంగిపోవాలని కోర్టు తెలిపింది.
ఇది కూడా చదవండి: Ronald Rose : హైదరాబాద్‌లో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి..
కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ఒక జాతీయ పార్టీకి నాయకుడని తెలిపారు. సమాజానికి ఎటువంటి ముప్పు కలిగించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. అయినా కూడా ఇంకా దోషిగా నిర్ధారించబడలేదని అభిప్రాయపడ్డింది. ఎటువంటి నేర చరిత్రలు లేవు కాబట్టి.. సమాజానికి ముప్పులేదని పేర్కొంది. కేవలం లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసమే బెయిల్ ఇస్తున్నట్లు తెలిపింది. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన వద్దని సూచించింది. ఈ కేసుకు సంబంధించి గత నెలలో బెయిల్ పొందిన ఆప్ నాయకుడు సంజయ్ సింగ్‌కు విధించిన బెయిల్ షరతులు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే మూడు విడతల్లో ఏప్రిల్ 19, 26, మే 7న పోలింగ్ ముగిసింది. నాల్గో విడత మే 13న జరగనుంది. అనంతరం మే 20, 25, జూన్ 1న జరగనుంది. ఢిల్లీలో మాత్రం మే 25న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Beer Cans: మద్యం తాగుతూ లక్షాధికారిగా మారిన వ్యక్తి.. ఎలా అంటే..