ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆప్ సర్కిల్‌లో.. సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రాఘవ్ చద్దా.. అదేనండీ.. ఆప్ రాజ్యసభ సభ్యుడు, యంగ్ లీడర్ రాఘవ్ చద్దా. ఆప్‌లో చాలా చురుగ్గా ఉండే ఈ రాఘవ్ చద్దా.. గత కొద్ది రోజుల నుంచి పత్తాలేకుండా పోయారు. అది కూడా ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు కనిపించకుండా పోయారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టై.. దాదాపుగా మూడు వారాలు అవుతోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇండియా కూటమి.. కేజ్రీవాల్‌కు మద్దతుగా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు అమెరికాతో సహా ఐక్య రాజ్య సమితి కూడా కేజ్రీవాల్ అరెస్ట్‌ను తప్పుపట్టాయి. కానీ సొంత పార్టీ నేత రాఘవ్ చద్దా మాత్రం నోరు మెదపలేదు. ఆయన ఉనికి గానీ.. ఆయన జాడగానీ ఎక్కడా కనిపించలేదు. ఎంత బిజీగా ఉన్నా.. ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా వేదికలు చాలా ఉన్నాయి. ఏదొక దాంట్లో స్పందించవచ్చు. కానీ ఇప్పటి వరకు కేజ్రీవాల్ అరెస్ట్ గురించి ఉలుకు లేదు పలుకు లేదు. ఇప్పుడు ఇదే నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 21న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టై తీహార్ జైల్లో ఉన్నారు. ఆయన అరెస్ట్‌ను ఆప్ లీడర్లంతా ఖండిస్తున్నారు. ఆందోళనలు కూడా చేస్తున్నారు. అప్పటి వరకు కేజ్రీవాల్ వెన్నంటే ఉండే రాఘవ్ చద్దా మాత్రం పత్తాలేకుండా పోయారు. అసలు ఆయన ఎక్కడున్నారు. ఏమైయిపోయారు అనేది ఇప్పుడు హాట్ టాఫిక్.
ఆరు నెలల క్రితం రాఘవ్ చద్దా.. బాలీవుడ్ భామ పరిణీతి చోప్రాను వివాహం చేసుకున్నారు. ఎంత హనీమూన్‌కు వెళ్లినా.. కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించలేనంతా తీరిక లేకుండా ఉంటుందా?, భార్యతో కలిసి ఆయన లండన్ వెళ్లారు. అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. పైగా దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. దేశంలో ఇంత హడావుడి నడుస్తుంటే.. రాఘవ్ చద్దా ఏం చేస్తున్నట్టు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఆప్ నేతలు సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాఠక్, రాఘవ్ చద్దాలను త్వరలో ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తారని ఆప్ మంత్రి అతిష్ ఇటీవల వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే రాఘవ్ చద్దా చప్పుడు చేయడం లేదని సమాచారం. కేసులకు భయపడే దూరంగా ఉంటున్నారని పొలిటికల్ సర్కిల్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా తనను బీజేపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని అతిష్ చెప్పుకొచ్చారు. అలాంటి ప్రతిపాదనే రాఘవ్ చద్దా కూడా వచ్చి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Kadapa Crime: కన్న కొడుకును కొట్టి చంపిన తండ్రి..
ఇక సోషల్ మీడియాలో అయితే రాఘవ్ చద్దాపై అనేక ట్రోల్స్ నడుస్తున్నాయి. పార్టీ నాయకుడు కష్టాల్లో ఉంటే.. భార్యతో ఎంజాయ్ చేస్తున్నాడని ట్వీట్స్ చేస్తున్నారు. బీజేపీకి భయపడే విదేశాలకు పారిపోయి ఉంటారని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఆయా రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వస్తున్న విమర్శలకు రాఘవ్ చద్దా స్పందిస్తారో.. లేదో చూడాలి. లేదంటే లైట్ తీసుకుంటారో చూడాలి.
ఇది కూడా చదవండి: Agent OTT: ఫ్యాన్స్‌కు శుభవార్త.. ఓటీటీలోకి అఖిల్ ‘ఏజెంట్’ సినిమా!