Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైను ఈడీ అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో ఈడీ వాదనలు వినిపించింది. అరుణ్ రామచంద్ర పిళ్లైని ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ న్యాయస్థానాన్ని కోరింది. ఈ నేపథ్యంలో ఈ నెల 13వరకు ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. పిళ్లై విచారణకు సహకరించడం లేదని ఈడీ న్యాయస్థానానికి తెలిపింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రతినిధి అంటూ అరుణ్ రామచంద్ర పిళ్ళై అంగీకరించారని… ఆయనను ఏడు రోజుల కస్టడీకి ఇవ్వండి అంటూ ఈడీ కోర్టును కోరింది. కేసు దర్యాప్తుకు సహకరించడం లేదని, మనీ ట్రయల్స్ గుట్టు తేల్చడానికి కస్టడీ అవసరమని, రూ.25కోట్లు నేరుగా ట్రాన్స్ఫర్ చేశారు..అంటూ ఈడీ వాదనలు వినిపించింది. అయితే పిళ్లైను అరెస్ట్ చేసేందుకు ఇంత ఆలస్యం ఎందుకు అయ్యిందని ఈడీ అధికారులను న్యాయమూర్తి ప్రశ్నించారు. లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్ సాక్ష్యం ఉన్న తర్వాత పదే పదే పిలిచి ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నారని… నేరుగా అరెస్ట్ చేయవచ్చు కదా అని న్యాయమూర్తి అడిగారు. ప్రస్తుతం కోర్టులో వాదనలు ముగిశాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైను గత రాత్రి ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మద్యం కుంభకోణంలో అవకతవకలపై ఇటీవల రెండు రోజులపాటు రామచంద్ర పిళ్లైని ఈడీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అరుణ్ పిళ్ళైకి చెందిన వట్టినాగులాపల్లిలో రూ .2.2 కోట్ల విలువైన భూమిని కూడా ఈడీ జప్తు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి రామచంద్ర పిళ్లైతో కలిపి ఇప్పటి వరకూ 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. ఇండో స్పిరిట్‌లో పిళ్లై భాగస్వామిగా ఉన్నాడని ఈడీ వెల్లడించింది. లిక్కర్ పాలసీ కోసం జరిగిన సమావేశాల్లో పిళ్లై పాల్గొన్నాడు. సమీర్ మహేంద్రుడితో కలిసి పిళ్ళై లిక్కర్ స్కాంలో కీలకంగా వ్యవహరించాడు. అరుణ్ పిళ్ళై, బుచ్చిబాబుకి సంబంధించిన వాట్సాప్ చాట్స్ ఉన్నాయని ఈడీ తెలిపింది. సౌత్ గ్రూప్ చెల్లించిన కిక్ బ్యాక్ అమౌంట్ పంపిణీలో ప్రధాన పాత్ర ఉందని పేర్కొంది. అరుణ్ పిళ్ళైతో బుచ్చిబాబును కలిపి విచారించాలని ఈడీ వెల్లడించింది.
Read Also: Sri chaitanya college: సాత్విక్ ఆత్మహత్య.. శ్రీచైతన్య కళాశాలకు శాశ్వత గుర్తింపు రద్దు
అరుణ్ పిళ్లై తరఫు న్యాయవాది కూడా తమ వాదనలు వినిపించారు. 29 రోజులు విచారణ జరిపారని..కానీ ఈడీకి సహకరించటం లేదు అని అంటున్నారని పిళ్లై తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈడీ అడిగినా వాటికి అన్ని సమాధానాలు పిళ్లై ఇచ్చాడని.. 29 సార్లు అరుణ్ పిళ్ళై విచారణను ఈడీ అధికారులు రికార్డ్ చేశారన్నారు. అరుణ్ పిళ్లై అమ్మ ఆరోగ్య బాగాలేదని.. థైరాయిడ్, మజిల్ పెయిన్ కిల్లర్ మెడిసిన్ ఇవ్వాలని పిళ్లై తరఫు న్యాయవాదని కోర్టుకు విన్నవించారు.