తెలుగు రాష్ట్రాల్లో భానుడి తాపానికి ప్రజలు అల్లాడుతున్నారు. ఎండలు మండిపోతుండటంతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. తప్పని సరి అయితే తప్ప బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అలా బయటకు వచ్చే వాళ్లు దాహార్తిని తీర్చుకునేందుకు కూల్ డ్రింక్స్, కొబ్బరి బోండాలు, చెరుకు రసం తాగుతున్నారు. కూల్ డ్రింక్స్ ను నిరాకరించే వాళ్లు ప్రకృతి నుంచి లభించే కొబ్బరి బోండాలపై ఆధారపడుతున్నారు. కొబ్బరి నీళ్లతో ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుండటంతో వాటికే ప్రాధాన్యమిస్తున్నారు.
READ MORE: LSG vs RR: ఆదుకున్న కేఎల్ రాహుల్, దీపక్ హూడా.. రాజస్థాన్ టార్గెట్ 197..
అదే వ్యాపారులకు అదునుగా మారింది. కొబ్బరి బోండాలకు డిమాండ్ పెరగడంతో రెండు రాష్ట్రాల వ్యాపారులు బోండాల ధరలు అమాంతం పెంచేస్తున్నారు. కొందరు సిండికేట్ గా మారి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. ప్రస్తుతం కొబ్బరి బోండాలకు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. దీనిని అడ్డుకోవాల్సిన వారు కూడా కమీషన్లకు ఆశ పడి చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రెండ్రోజుల్లోనే ధరలు పెరిగాయి. నిన్న మొన్నటి వరకు రూ. 30-40 మధ్య ఉన్న ధర కాస్త రూ. 50-60కు చేరుకుంది. ఏపీలోని కర్నూల్ జిల్లాలో ధర మరీ ఎక్కువగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సిండికేట్ కు అడ్డుకట్ట వేయాలని.. ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని జనాలు కోరుతున్నారు.