గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంటూరు పార్లమెంటుకు సంబంధించి, ఏడు అసెంబ్లీ స్థానాల కౌంటింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. భద్రత ఏర్పాట్లు కూడా బాగున్నాయన్నారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర బలగాలని మోహరించి ఈవీఎంలకు రక్షణ కల్పిస్తున్నామని చెప్పారు. అభ్యర్థులకు స్ట్రాంగ్ రూముల ఫుటేజ్ కనబడేందుకు వీలుగా యూనివర్సిటీ లోనే లైవ్ లింక్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. పల్నాడు లో పోలింగ్ డే తర్వాత, కొన్ని ఘర్షణ పూరిత అల్లర్లు జరిగాయని.. అందుకే పల్నాడులో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామన్నారు. పల్నాడులో అల్లర్లను దృష్టిలో పెట్టుకుని 20 కంపెనీల కేంద్రబలగాలు జిల్లాలో మకాం వేసి ఉన్నాయన్నారు. పల్నాడులో ప్రస్తుత పరిస్థితి పూర్తి అదుపులో ఉందని తెలిపారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా మరో 15 రోజులు పాటు రాష్ట్రంలో కేంద్ర బలగాల పహారా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
READ MORE: Janhvi kapoor: నటితో కలిసి చెన్నైలో గుడికెళ్లిన జాన్వీ కపూర్.. శ్రీదేవి ఫేవరెట్ ప్లేస్ అంటూ!
కాగా.. సార్వత్రిక ఎన్నికలల్లో ఘర్షణలు జరిగిన 15సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని పల్నాడు ఎస్పీ మలికా గార్గ్ ఇటీవల తెలిపారు. వివిధ కేసుల్లో 666మంది నేర చరిత్ర గల వ్యక్తులను గుర్తించామని పేర్కొన్నారు. రౌడీ షీటర్ల మీద ప్రత్యేక నిఘా పెట్టామని..చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే జిల్లా బహిష్కరణ చేస్తామన్నారు. మాచర్ల, నరసరావుపేటలో పోలీస్ భద్రతను పెంచామని చెప్పారు. బైండొవర్ కేసుల్లో ముద్దాయిలను జరిమానా విధిస్తున్నామని పేర్కొన్నారు. భారీ భద్రత CRPS బలగాలతో పల్నాడులో భద్రతను పెంచామని వెల్లడించారు. ఈనెల 4వ తేదీన కౌంటింగ్ సమయం కావడంతో మరింత భద్రత పెంచామని.పల్నాడు జిల్లా లో పోలీసులంతా కౌంటింగ్ సమయంలో విధుల్లోనే ఉంటారని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు నాయకులు, పల్నాడు జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.