NTV Telugu Site icon

Himantha Biswa Sarma: రాహుల్.. సైన్యం పౌరులపై కాల్పులు జరపాలని సూచిస్తున్నారా?

Himantha Biswa Sarma

Himantha Biswa Sarma

Himantha Biswa Sarma: మణిపూర్‌లో భారత సైన్యం దేనినీ పరిష్కరించదు అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శుక్రవారం అన్నారు. ఇప్పుడు 100 రోజులకు పైగా కొనసాగుతున్న జాతి హింసకు పరిష్కారం బుల్లెట్ల నుంచి కాకుండా గుండెల నుంచి రావాలన్నారు. ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రంలో ఆర్మీ రెండు రోజుల్లో ఈ అల్లర్లను ఆపగలదని శుక్రవారం కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ సూచించగా.. సైన్యం పౌరులపై కాల్పులు జరపాలని సూచిస్తున్నారా అని హిమంత బిస్వా శర్మ ప్రశ్నించారు. “ఇండియన్‌ ఆర్మీ గతంలో మిజోరంలోని ఐజ్వాల్‌లో ఆ పని చేసింది. బాంబులు వేసిన తరువాత హింస తగ్గుముఖం పట్టింది. మణిపుర్‌లో హింసను భారత సైన్యమే ఆపాలని రాహుల్ అంటున్నారు. అంటే అర్థం ఏమిటి? పౌరులపై కాల్పులు జరపాలా? అదే ఆయన ఉద్దేశమా? అలా ఎలా చెబుతారు? ఆర్మీ దేనినీ పరిష్కరించదు. తాత్కాలిక ప్రశాంతత మాత్రమే ప్రస్తుతానికి తీసుకురాగలదు. కానీ పరిష్కారం గుండె నుంచి రావాలి, బుల్లెట్ల నుండి కాదు.” అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు.

Read Also: Join My Wedding: పెళ్లి చేసుకోండి.. కోట్లు సంపాదించండి

హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. ఈ అంశంపై మొదట ప్రధాని మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయని, ఆపై లోక్‌సభలో ప్రధాని మోదీ రెండు గంటలకు పైగా ప్రసంగం సందర్భంగా పార్లమెంటు నుండి వాకౌట్ చేయడం.. మణిపూర్‌కు సాయం చేయాలనే ఉద్దేశం విపక్షాలకు ఎంత మాత్రం లేదని తేలిపోయిందన్నారు. పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవడమే ప్రతిపక్షాల అజెండా అంటూ మండిపడ్డారు. మణిపుర్‌ రాష్ట్రం గురించి ప్రతి మాట ప్రధాని మనసుతో మాట్లాడారన్నారు. ఈశాన్యం గురించి ఆయన చూపిన చొరవ పట్ల సంతోషిస్తున్నామని హిమంత బిస్వా శర్మ పేర్కొన్నారు.

గత నాలుగు నెలలుగా రాష్ట్రం మండిపోతున్నప్పుడు పార్లమెంటులో నవ్వడం, జోకులు పేల్చడం ప్రధానికి తగదని రాహుల్ గాంధీ శుక్రవారం అన్నారు.మణిపూర్‌ను కాల్చివేయాలని ప్రధాని కోరుకుంటున్నారని, దానిని కాల్చడానికి అనుమతిస్తున్నారని ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాహు్ల్‌ గాంధీ ఆరోపించారు. హింసను ఆపాలని ప్రభుత్వం కోరుకుంటే, ప్రభుత్వం చేతిలో సాధనాలు ఉన్నాయని నొక్కి చెప్పారు.