Arakan Army: పాకిస్థాన్ నుంచి విడిపోయిన తర్వాత 1971లో బంగ్లాదేశ్ భారత్ సహాయంతో ప్రత్యేక దేశంగా అవతరించింది. తాజాగా మరోమారు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్లాన్స్ చేస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. బంగ్లాదేశ్‌కు సంబంధించి అరకాన్ ఆర్మీ దేశ విభజనకు ప్రమాదకరమైన ప్రణాళిక రచిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. రఖైన్లో ప్రత్యేక దేశాన్ని సృష్టించి బంగ్లాదేశ్‌ను విచ్ఛిన్నం చేయడానికి అరకాన్ ఆర్మీ యోధులు రహస్య మిషన్‌లో పనిచేస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అరకాన్ ఆర్మీ బంగ్లాదేశ్-మయన్మార్ సరిహద్దులో చాలా చురుకుగా ఉంది. అరకాన్ ఆర్మీ యోధులు ఈ సరిహద్దు ప్రాంతాల్లో దేశ సైనిక దళాలతో పోరాడుతున్నారు.
రఖైన్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది..
బంగ్లాదేశ్ వార్తాపత్రిక నయా దిగంత కథనం ప్రకారం.. అరకాన్ సైన్యం బంగ్లాదేశ్ నుంచి విడిపోవడానికి ఒక ప్రణాళికను రూపొందిస్తున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా కొండ తెగలకు ఆయుధ వినియోగంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈ ప్రత్యేక శిక్షణలో గిరిజన ప్రజలను ప్రత్యేక దేశం అనే ఆలోచనలోకి నెడుతున్నారు. మయన్మార్‌లోని బౌద్ధులు ఎక్కువగా నివసించే రాష్ట్రం రఖైన్. అరకాన్ సైన్యం చాలా కాలంగా ప్రత్యేక ప్రావిన్స్ కోసం పోరాడుతోంది. 2017లో అరకాన్ సైన్యం, రోహింగ్యాల మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు 700,000 మంది రోహింగ్యాలు వారి ఇళ్లను వదిలి వలస వెళ్లారు. ప్రత్యేక రఖైన్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని అరకాన్ సైన్యం డిమాండ్ చేస్తుంది. రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేకమైన మ్యాప్‌ను కూడా వాళ్లు విడుదల చేశారు. మయన్మార్‌కు చెందిన రఖైన్ రాష్ట్రం, బంగ్లాదేశ్ ఆగ్నేయంతో పాటు ఉన్నట్లు వారి మ్యాప్‌లో ఉంది. రఖైన్ రాష్ట్రం అవతరిస్తే బంగ్లాదేశ్‌లోని బందర్బన్, కాక్స్ బజార్ ప్రాంతాలు ఢాకా చేతుల్లోంచి జారిపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
అరకాన్ సైన్యం బలం ఎంత?
నయా దిగంత కథనం ప్రకారం.. అరకాన్ సైన్యంలో ప్రస్తుతం 45 వేల మంది యోధులు ఉన్నారు. ఈ సంఖ్యను పెంచడంపై అరకాన్ సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొంది. ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకోడానికి వాళ్లు క్రమం తప్పకుండా ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించింది. ఈ సంస్థ బంగ్లాదేశ్‌లోకి కూడా విస్తరిస్తోందని, ముస్లింల పట్ల భయాన్ని కలిగించడం ద్వారా, స్థానిక తెగలను ఆకర్షిస్తోందని నయా దిగంత తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం అరకాన్ ఆర్మీ చేతిలో దాదాపు 271 కి.మీ. మయన్మార్ భూభాగం ఉందని తెలిపింది. సంస్థను మరింత బలోపేతం చేసుకోవడానికి, అరకాన్ ఆర్మీ యోధులు బంగ్లాదేశ్ సరిహద్దులో మాదకద్రవ్యాలు, స్మగ్లింగ్, ఇతర వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారని, నిధులను సేకరించడానికి విశేషంగా ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.
READ ALSO: Pawan Kalyan: నేను ఓడిపోయినప్పుడు నా భుజం తట్టిన వ్యక్తి జస్టిస్ వి. గోపాల గౌడ..