ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు గ్రూప్-2 ప్రధాన పరీక్ష జరగనుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది. టైం దాటితే లోపలకు అనుమతించేది లేదని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు రాసేందుకు అభ్యర్ధులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద తమ హాల్ టికెట్స్ సరిచూసుకుని తమకు కేటాయించిన పరీక్షా గదులలోకి వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో గ్రూప్-2 ప్రధాన పరీక్షల కోసం ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. ప్రిలిమ్స్ ద్వారా ప్రధాన పరీక్ష రాసేందుకు 92,250 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. గ్రూపు-2 మెయిన్ పరీక్షలకు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమలు చేసింది. భారీ భద్రత నడుమ గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-2 ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని కూటమి ప్రభుత్వం సూచించినా.. ఏపీపీఎస్సీ మాత్రం యథావిధిగా పరీక్ష నిర్వహించేందుకే మొగ్గు చూపిన విషయం తెలిసిందే.