AP SSC 10th Results 2024: ఏపీ టెన్త్ 2023-24 ఫలితాలు విడుదలయ్యాయి.. ఈ సారి కూడా బాలికలే పైచేయి సాధించారు.. ఎస్ఎస్సీ ఫలితాలను విడుదల చేసిన ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్ధి వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు అన్నారు. ఇక, ఈ ఏడాది 6,16,615 మంది పరీక్షలు రాశారు.. 16 లక్షల్లో 86.69 శాతం విద్యార్థులు.. అంటే 5,34,578 మంది ఉత్తీర్ణులు అయినట్టు వెల్లడించారు.. ఇక, వీరిలో బాలురు 83.21 శాతం, బాలికలు 89.17 శాతం పాస్ అయ్యారని తెలిపారు.. 17 స్కూళ్లలో మాత్రమే ఒక్కరూ పాస్‌కాలేదన్నారు.
పదో తరగతి పరీక్ష ఫలితం ఒక ప్రామాణికంగా పేర్కొన్నారు సురేష్ కుమార్.. కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ జరగకూడదని 6 నెలల పాటు పని చేసి పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు.. 45 వేల మంది సిబ్బంది ఈ పరీక్ష నిర్వహణలో ఉన్నారు.. 20 వేల మంది వాల్యుయేషన్ లో పాల్గొన్నారని తెలిపారు. ఇక, మన్యం జిల్లా మొదటి స్ధానంలో ఉండగా.. కర్నూలు జిల్లా చివరి స్ధానంలో ఉందన్నారు. మన్యం జిల్లాలో 96.37 శాతం మంది విద్యార్థులు పాస్ అయితే.. కర్నూలు జిల్లాలో కేవలం 62.47 శాతం విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారన్నారు. మరోవైపు.. తెలుగు మీడియంలో ఉత్తీర్ణత 71.08 శాతంగా ఉంటే.. ఇంగ్లీష్ మీడియంలో 92.32 శాతం ఉత్తీర్ణత ఉందని.. అదే హిందీ మీడియంలో 100 శాతం ఉత్తీర్ణులు అయినట్టు వివరించారు.
రాష్ట్రంలోని 2803 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు.. 17 స్కూళ్లలో 0 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఇందులో ప్రభూత్వ స్కూల్ ఒకటి మాత్రమే ఉంది.. 69.26 శాతం మంది మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఇక, అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు వెల్లడించారు ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్.. నాలుగు రోజుల్లో పూర్తి వివరాలతో కూడిన మార్క్స్ మెమో ఆన్ లైన్‌లో ఉంటుందని పేర్కొన్నారు. మైగ్రేషన్ కు అప్లై చేసిన వారికి కూడా ఆన్ లైన్ లోనే ఇవ్వడం జరుగుతుందన్నారు.
విద్యార్ధులకు పర్మనెంట్ ఐడెంటిటీ నంబర్ (PEN) ఉండాలి.. ఈ నంబరుతో విద్యార్ధి వివరాలు అన్నీ ఇవ్వడం జరుగుతుంది.. పర్మనెంటు నంబరుతోనే అన్ని వివరాలు ఉంటాయి.. ఈ విద్యా సంవత్సరం నుంచీ PENను అమలులోకి తెస్తున్నాం అన్నారు. దేశంలోనే PEN ను అమలులోకి తెచ్చిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వెల్లడించారు. ఎవరి సహాయం లేకుండా కంప్యూటర్ ద్వారా దివ్యాంగులు 13 మంది కర్నూలులో పరీక్ష రాశారు.. వారందరూ పాస్ అయ్యారని వెల్లడించారు ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్..