Srisailam Water Release: గుడ్‌న్యూస్‌.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం

Nimmala

Nimmala

Srisailam Water Release: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు శుభవార్త చెబుతూ.. శ్రీశైలం డ్యామ్‌ నుంచి నీటిని విడుదల చేశారు.. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో తాగునీటి భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. 2027 జూన్ వరకు సూపర్ ఎల్‌నినో ప్రభావం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో శ్రీశైలం జలాశయంలోని నీటిని ప్రధానంగా తాగునీటి అవసరాల కోసం భద్రపరచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 119 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, రాబోయే పది రోజుల్లో మరో 100 టీఎంసీల వరకు ఇన్‌ఫ్లో వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. కృష్ణా నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 63 శాతం వాటాను ముందుగా తాగునీటి అవసరాలకే వినియోగిస్తామని స్పష్టం చేశారు.

రాయలసీమలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం నుంచి నీటి విడుదల చేపడుతున్నామని చెప్పారు మంత్రి నిమ్మల.. హంద్రీ-నీవా పరిధిలోని రిజర్వాయర్లకు 13 టీఎంసీల నీరు అవసరమని, అలాగే పోతిరెడ్డిపాడు పరిధిలోని రిజర్వాయర్లకు తాగునీటి కోసం రేపటి నుంచి 10 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక, తెలుగు గంగ పథకం ద్వారా చెన్నై తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉందని, నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల పరిధిలోని తాగునీటి అవసరాల కోసం మరో 32 టీఎంసీల నీరు అవసరమని మంత్రి వివరించారు. వర్షాలు, వరదల పరిస్థితులను ప్రతి వారం సమీక్షిస్తూ ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేలా కార్యాచరణ రూపొందిస్తామని నిమ్మల రామానాయుడు తెలిపారు. జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి రాష్ట్రంలో తాగునీటి భద్రతకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు..