AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ లైవ్ అప్‌డేట్స్.. విజయవాడ 55వ డివిజన్‌లో నిలిచిన పోలింగ్!

Ap Local Body Elections 2026 Live Updates

Ap Local Body Elections 2026 Live Updates

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల సమరం మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరుగుతుండగా.. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు, 6 నగర పంచాయతీల్లో అధికారులు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టగా.. 8 చోట్ల ఎన్నికలు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 92 స్థానిక సంస్థల్లో ఓటింగ్ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11,378 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

  • 01 Nov 2026 09:01 AM (IST)

    ఓటు హక్కును వినియోగించుకున్న బాలకృష్ణ దంపతులు!

    హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర దేవి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డు ఒకటవ బూత్ లో బాలకృష్ణ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 'ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది వారి ప్రాథమిక హక్కు. పనిచేసే వారికి ఓటెయ్యాలి, పనిచేయని వారికి ఓటేయరాదు. అభివృద్ధిని చూసి ప్రజలు ఓటెయ్యాలి' అని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.

  • 01 Nov 2026 08:47 AM (IST)

    85 మంది రౌడీ షీటర్ల బైండ్ ఓవర్!

    ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ నిఘా ముమ్మరం చేశారు. కార్పొరేషన్ పరిధిలో 85 మంది రౌడీ షీటర్లను ఇప్పటికే బైండ్ ఓవర్ చేశారు. ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ సమస్య ఆత్మకు పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

  • 01 Nov 2026 08:45 AM (IST)

    వైసీపీ కార్యకర్తలకు గాయాలు!

    పులివెందుల సరస్వతి విద్యామందిర్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. 38వ వార్డు దగ్గర వైసీపీ శ్రేణులపై టీడీపీ నేతలు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో వైసీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.

  • 01 Nov 2026 08:29 AM (IST)

    విజయవాడ 55వ డివిజన్‌లో నిలిచిన పోలింగ్!

    విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల ముద్రణ పొరపాటు కలకలం రేపింది. నగరంలోని పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఓల్డ్ రాజరాజేశ్వరి పేట 55వ డివిజన్‌లో అభ్యర్థుల పేర్లకు ఎదురుగా ఎన్నికల గుర్తులు తారుమారుగా ముద్రితమయ్యాయి. ఈ విషయం వెలుగులోకి రావడంతో అధికారులు వెంటనే స్పందించి ఆ డివిజన్‌లో పోలింగ్ ప్రక్రియను నిలిపివేశారు. 55వ డివిజన్‌లో రెండు గంటల పాటు పోలింగ్ ఆలస్యం కానుంది.

  • 01 Nov 2026 08:16 AM (IST)

    అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉద్రిక్తత!

    అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ బూత్‌లోకి తమ ఏజెంట్లను అనుమతించడంలేదని వైసీపీ ఆందోళన చేపట్టింది. వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వెంకటచలపతి రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు.

  • 01 Nov 2026 07:57 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న ఏబీ వేంకటేశ్వర రావు!

    విజయవాడలో తన ఓటు హక్కును ఏబీ వెంకటేశ్వరరావు వినియోగించుకున్నారు. 'ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంత ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడం మంచి పరిణామం. ప్రతీ ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. నిన్న కొంతమంది అభ్యర్థులు డబ్బులు పంచుతుండగా మావాళ్లు వీడియోలు రికార్డ్ చేశారు. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాను' అని ఎన్టీవీతో ఏబీవీ ప్రతేకంగా చెప్పారు.

  • 01 Nov 2026 07:51 AM (IST)

    పులివెందుల 27వ వార్డు పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత!

    పులివెందుల 27వ వార్డు పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వృద్ధురాలి చేతిలోని బ్యాలెట్ స్లిప్‌ను టీడీపీ ఏజెంట్లు లాక్కున్నారు. పులివెందుల సత్రం స్కూల్ పోలింగ్ బూత్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది.

  • 01 Nov 2026 07:35 AM (IST)

    పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల హౌస్ అరెస్ట్!

    ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పల్నాడు జిల్లాలో వైసీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని హౌస్ అరెస్ట్, వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హౌస్ అరెస్ట్ అయ్యారు. కొందరు వైసీపీ నేతలను బైండోవర్ చేసి.. పోలీస్ స్టేషన్‌లకు తరలించారు.

  • 01 Nov 2026 07:25 AM (IST)

    బెజవాడ కార్పొరేషన్‌లో అభ్యర్థుల గుర్తులు తారుమారు!

    బెజవాడ కార్పొరేషన్‌లో అభ్యర్థుల గుర్తులు తారుమారు అయ్యాయి. 55వ డివిజన్ ఎన్నికల బ్యాలెట్ పేపర్లో గుర్తులు తారుమారయ్యాయి.

  • 01 Nov 2026 07:19 AM (IST)

    ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్!

    మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు, 6 నగర పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది.