Minister Anitha: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హెట్రో పరిశ్రమలో సోడియం హైపోక్లోరైట్ గ్యాస్ లీక్ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయంపై రాష్ట్ర హోంమంత్రి అనిత స్పందించారు. తక్షణ చర్యల్లో భాగంగా ముగ్గురు బాధితులను మెరుగైన వైద్యం కోసం కేర్ ఆసుపత్రికి తరలించామని హోంమంత్రి తెలిపారు. ప్రస్తుతం ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో బాధితులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా సమగ్ర వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
Also Read: YSR Congress Party: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సీఎం చిత్తశుద్ధితో పని చేస్తున్నారా..?
పరిశ్రమల్లో భద్రతాపరమైన చర్యలు, పొల్యూషన్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని హోంమంత్రి వెల్లడించారు. భద్రతాపరమైన అంశాలపై హెట్రో పరిశ్రమలో ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, ఎమ్మెల్సీ కోడ్ కారణంగా ఇప్పటివరకు సమావేశం నిర్వహించలేకపోయామని, త్వరలో ఆ సమావేశం నిర్వహిస్తామని హోంమంత్రి తెలిపారు. పరిశ్రమల్లో భద్రత పెంచడంపై హై లెవల్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే పరిశ్రమలు సహాయక చర్యలు చేపట్టేలా సిద్ధంగా ఉండాలని పరిశ్రమలకు సూచించారు.
Also Read: Aadhar card: భారతదేశంలో ఆ రాష్ట్రంలో ఆధార్ కార్డులు నిషేధం!.. కారణం ఏంటంటే?
అలాగే కేజీహెచ్ ఘటనపై హోంమంత్రి మాట్లాడుతూ, ఈ ఘటనలో రౌడీ షీటర్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. కేజీహెచ్ ఆసుపత్రిని త్వరలో సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తామని వెల్లడించారు. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా గంజాయి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రి తెలిపారు. గంజాయి సరఫరా చేయడం, వినియోగం చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నామని, డ్రైన్స్ ద్వారా గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పెంచుతున్నామని హోంమంత్రి చెప్పారు. జైళ్లలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచుతున్నామన్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా భద్రతా ప్రమాణాలు కట్టుదిట్టం చేస్తామని హోంమంత్రి అనిత భరోసా ఇచ్చారు.