AP High Court: ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి బ్రేక్ పడింది.. హైకోర్టు తీర్పుతో ఆర్ 5 జోన్ జగనన్న లేఅవుట్స్ లో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి.. అమరావతిలో ఇళ్ల నిర్మాణంపై ఈ రోజు వైఎస్ జగన్ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇళ్ల నిర్మాణాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన ధర్మాసనం.. అక్కడ యథాతథ స్ధితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.. అమరావతి ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
Read Also: Telangana Assembly: అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ఈటల వద్దకు కేటీఆర్..!
సరిగ్గా 10 రోజుల కిందట సుమారు 50 వేల ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. కానీ, అమరావతిపై హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో.. ఇక్కడ పేదలకు ఇళ్ల స్ధలాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న తరుణంలో దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అమరావతిలో ఆర్-5 జోన్ ఏర్పాటు, 1402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవోలు, ఇళ్ల నిర్మాణ ప్రక్రియను హైకోర్టులో సవాల్ చేశారు. ఇక, వీటిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. గతంలో ఇళ్ల స్ధలాల కేటాయింపు సందర్భంగా సుప్రీంకోర్టు అమరావతిపై ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఇవి ఉండాలని పేర్కొంది. కానీ, అక్కడ శాశ్వత కట్టడాలుగా ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టడంతో ఈ వ్యవహారం మరోసారి హైకోర్టుకు చేరింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఇళ్ల నిర్మాణాన్ని తక్షణం నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది. అమరావతి ఆర్5 జోన్ లో యథాతథ స్ధితి కొనసాగించాలని స్పష్టం చేసింది.. దీంతో, ఇళ్ల నిర్మాణానికి బ్రేక్ పడింది.. హైకోర్టు తీర్పుతో ఆర్ 5 జోన్ జగనన్న లేఅవుట్స్ లో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి.. నిర్మాణ పనుల సిబ్బంది వెళ్లి పోవటంతో బోసిపోతున్నాయి లేఅవుట్లు.. న్యాయ స్థానాల నుంచి స్పష్టత వచ్చేంత వరకు పనుల నిలిచిపోనున్నాయి.. మరోవైపు.. హైకోర్టు తీర్పు పై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.. సర్వోన్నత ధర్మాసనం ఇచ్చే తీర్పు పైనే ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణ భవిష్యత్తు ఆధారపడినట్టు అయ్యింది.