Andhra Pradesh: ఏపీలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు హైకోర్టు గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్షేమ పథకాల లబ్దిదారులకు నగదు జమ చేయకుండా ఆపాలన్న ఈసీ నిర్ణయంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యాదీవెన, ఆసరా, ఈబీసీ నేస్తం ఇన్‌పుట్ సబ్సిడీ, చేయూత నిధులను ఎన్నికలు పూర్తయ్యే వరకు విడుదల చేయొద్దన్న ఎన్నికల సంఘం ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. నిధుల విడుదల చేయవద్దన్న ఈసీ ఆదేశాలను తాత్కాలికంగా ఇవాళ వరకు నిలుపుదల చేస్తూ హైకోర్టు ఆదేశించింది. నేడు ఒక్కరోజు వెసులుబాటు కల్పించిన హైకోర్టు.. ఈ నెల 11 నుంచి 13 వరకు నిధుల విడుదల చేయవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నిధుల పంపిణీ విషయాన్ని ప్రచారం చేయవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇందులో నేతల జోక్యం ఉండొద్దని, ప్రచారం చేయవద్దని ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 27కు వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: Gold Price Today: ‘అక్షయ తృతీయ’ వేళ మహిళలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!
ఇవాళ ఒక్క రోజు నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఖాతాల్లో నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పు కాపీతో ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని సంప్రదించింది. క్లారిఫికేషన్ కోసం అధికారులు ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇప్పటివరకూ ఎన్నికల సంఘం ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఈసీ పరిధిలో పనిచేస్తున్నందున కమిషన్ క్లారిఫికేషన్ ఇస్తే తప్ప ముందుకు వెళ్లలేమని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అంటున్నారు.