‘రాజధాని ఫైల్స్’ సినిమా విడుదలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైసీపీ అభ్యంతరాలను తోసిపుచ్చిన హైకోర్టు.. స్టే కొనసాగించేందుకు నిరాకరించింది. రివైజింగ్ కమిటీ అన్ని సర్టిఫికెట్లు పరిశీలించాకే ధ్రువపత్రం జారీ చేసిందని హైకోర్టు స్పష్టం చేసింది. దాంతో నేటి నుంచి యధావిధిగా రాజధాని ఫైల్స్ షోలు కొనసాగనున్నాయి. రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనను రెవెన్యూ అధికారులు గురువారం అడ్డుకున్న విషయం తెలిసిందే.
సీఎం జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేందుకు రాజధాని ఫైల్స్ సినిమా తీశారని.. సెన్సార్ బోర్టు జారీ చేసిన ధ్రువ పత్రాన్ని రద్దు చేయాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 13న విచారణ జరిపిన హైకోర్టు.. సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేయాలని గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం విచారణ చేపట్టి సినిమా విడుదలకు అంగీకారం తెలిపింది. సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ ఇచ్చిన ధ్రువపత్రాలను పరిశీలించిన కోర్టు.. స్టే కొనసాగించేందుకు నిరాకరించింది. నిబంధనల మేరకు అన్ని సర్టిఫికెట్లు జారీ చేశారని పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. విచారణను కోర్టు వాయిదా వేసింది.
Also Read: Moto G04 Offers: జియో యూజర్లకు స్పెషల్ ఆఫర్.. రూ.2 వేల వరకు క్యాష్‌బ్యాక్!
ఆంధ్రప్రదేశ్ రాజధాని నేపథ్యంలో రాజధాని ఫైల్స్ చిత్రాన్ని భానుప్రకాశ్ తెరకెక్కించారు. ఈ సినిమాను కంఠంనేని రవిశంకర్ నిర్మించారు. ఈ చిత్రంలో వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్, పుష్పరాజ్ అఖిలన్, వీణ పంచపర్వాల, పవన్, షణ్ముఖ్ నటించారు. యాత్ర, లక్ష్మీస్ ఎన్టిఆర్, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, యాత్ర-2 లాంటి సినిమాలు రాజకీయ నేపథ్యంలో వచ్చిన విషయం తెలిసిందే.