ప్రభుత్వం జిల్లాలో కృష్ణా నదీ తీరాన స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తోంది. ఇబ్రహీంపట్నంను ఆనుకుని ఉన్న కృష్ణా లంక భూములను మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, బోండా ఉమా, జిల్లా కలెక్టర్ లక్షిషా, ఇతర అధికారులు పరిశీలించారు. కృష్ణా నదిలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల పరిధిలోనీ పెద లంక, చిన లంకలో ఉన్న లంకభూములు పరిశీలించారు. మూడు కిలోమీటర్లు లంక భూముల్లో కాలినడకన తిరిగారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఊపందుకుంటున్నాయని.. ఇప్పటికే 3 వేల మంది కార్మికులు,500 మెషీన్లు పనులు చేస్తున్నాయన్నారు.
READ MORE: YSRCP: వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్..
ఈ నెలాఖరుకు సుమారు 15 వేల మంది కార్మికులు రోజువారీ పనుల్లో పాల్గొంటారని మంత్రి నారాయణ తెలిపారు. మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించేలా స్పోర్ట్స్ సిటీ ఉండాలని సీఎం చంద్రబాబు చెప్పినట్లు వెల్లడించారు. దీని కోసం 2 వేల ఎకరాల భూమి అవసరం ఉంటుందని.. కృష్ణా లంక భూముల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. జలవనరుల శాఖ అధికారులు, కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి కమిటీ ఏర్పాటు చేశామన్నారు. నెలరోజుల్లోగా కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని.. కమిటీ నివేదిక ఆధారంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు.
READ MORE: Amithabachan : ఫాలోవర్లను ఎలా పెంచుకోవాలి.. ఫ్యాన్స్ కు అమితాబ్ ప్రశ్న..