AP Government: మరో రెండు రోజుల్లో కొత్త నెల ప్రారంభం కానుంది. ఇంకోవైపు ఎలక్షన్ కోడ్ ఉంది. దీంతో.. పింఛన్ల పరిస్థితి ఏంటి.. ఎవరిస్తారు.. ఎప్పుడిస్తారు అని డైలమాలో ఉన్న అవ్వాతాతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతీ నెల ఇచ్చినట్లే ఈసారి కూడా మే నెల ఒకటో తేదీనే పింఛన్లు ఇస్తామని స్పష్టం చేసింది. పింఛన్ల కోసం సచివాలయాలకు వచ్చే పనిలేకుండా బ్యాంకు ఖాతాల్లో మొత్తాన్ని జమ చేస్తామని ప్రకటించింది. అకౌంట్లు లేనివారికి ఇంటివద్దనే పంపిణీ చేస్తామని తెలిపింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీపై జిల్లా కలెక్టర్లతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలోనే పింఛన్లను బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని అధికారులను ఆదేశించారు.
Read Also: KCR: వరంగల్ లో కేసీఆర్ రెండోరోజు పర్యటన.. ముఖ్య నేతలతో సమావేశం..
ఏపీలో మొత్తం 65 లక్షల 49 వేల 864 మంది పెన్షనర్లు ఉండగా… 48 లక్షల 92 వేల 503 మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. వీరందరికీ పింఛన్ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. బ్యాంకు అకౌంట్లు లేనివారికి, దివ్యాంగులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నేరుగా ఇంటి వద్దనే పింఛన్ అందించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మార్చి వరకు ప్రతి నెలా ఒకటో తేదిన వాలంటీర్లు ప్రతి లబ్ధిదారుని ఇంటికి వెళ్లి పెన్షన్ అందించారు. అయితే, ఎలక్షన్ కోడ్‌తో వాలంటీర్లను పింఛన్ల పంపిణీ బాధ్యతల నుంచి ఎన్నికల కమిషన్ తప్పించింది. దీంతో ఏప్రిల్ 1న లబ్ధిదారులు సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకోవాలని గవర్నమెంట్ సూచించింది. దీంతో పలువురు వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. కొందరు ఎండదెబ్బకు గురయ్యారు. ఇలాంటి పరిస్థితి మళ్లీ తలెత్తకుండా చూడాలని ఈసీ మరోసారి ఏపీ ప్రభుత్వానికి సూచించింది. దీంతో జిల్లా కలెక్టర్లతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. పెన్షన్లను బ్యాంకు ఖాతాల్లో వేయాలని సూచించారు.