AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు ఉండటంతో కార్పొరేషన్‌లో 410 మంది ఉద్యోగులను తొలగించే విధంగా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఫైబర్ నెట్‌లో 410 మంది ఉద్యోగులను తొలగించటానికి నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఫైబర్ నెట్‌లో 2016-19 మధ్య 108 ఉద్యోగులతో నడిపామని.. 10 లక్షల కనెక్షన్లు అప్పట్లో ఉన్నాయని.. 2019-24 మధ్య వైసీపీ సమయంలో ఉద్యోగులను 1360కి పెంచారని.. ఫైబర్ నెట్ సంస్థ బిజినెస్ పెరగలేదు, నష్టాలు వచ్చాయని ఆయన తెలిపారు. కనెక్షన్లు ఐదు లక్షలకు పడిపోయాయని జీవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో వచ్చిన ఉద్యోగులు అందరూ ఎంపీ అవినాష్ రెడ్డి సహా మరికొందరు నేతల సిఫార్సుతో వచ్చారని.. అవసరం లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిపారని ఆయన విమర్శించారు. ఆఫర్ లెటర్, అపాయింట్‌మెంట్ కూడా లేకుండా ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు.
Read Also: APSRTC Chairman: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై గుడ్‌న్యూస్!
లీగల్ సర్వీస్ కూడా మొత్తం పరిశీలించామని ఆయన తెలిపారు. ఉద్యోగస్తుల విషయంలో ఇబ్బంది లేదని.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఉద్యోగులను మాత్రమే తొలగిస్తున్నామన్నారు. అడ్డగోలుగా తొలగించటం చేయటం లేదన్నారు. ఎగ్జిట్ ఫార్మాట్ ద్వారా ప్రొసీజర్ ద్వారా మాత్రమే ఉద్యోగుల తొలగింపు చేస్తున్నామన్నారు. 410 మంది ఉద్యోగులను ప్రొసీజర్ ప్రకారం మాత్రమే తొలగిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఉద్యోగాలు ఇక్కడ ఉంటాయి తప్ప.. ఉద్యోగులు ఎక్కడో ఉంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత కక్షతో ఉద్యోగాలు తొలగించటం లేదన్నారు. ప్రొసీజర్ ప్రకారం నియామకాలు జరగటం లేదని.. 2 వేల కోట్లకు పైగా అప్పులు సంస్థకు ఉన్నాయని మండిపడ్డారు. ఉద్యోగం తొలగింపుకు గురైన వారు ఎక్కువ చేస్తే వారి నుంచి జీతాల రికవరీతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. జీతాలు ఇచ్చిన వారు ఎవరైనా వివరణ కోసం నోటీసు ఇస్తామన్నారు. మాజీ ఎండీ నుంచి రికవరీ చేయటానికి కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
Read Also: CP Avinash Mohanty : ఈ ఏడాది 70 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల నుంచి బాధితులకు రిఫండ్ చేసి ఇచ్చాం..
రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా చెల్లింపులపై ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ జీవీ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ నుంచి రాంగోపాల్ వర్మకు రూ.1కోటి15లక్షల రూపాయలు అక్రమంగా చెల్లించారని అన్నారు. రాంగోపాల్ వర్మ కు నోటీసులు ఇచ్చి డబ్బు చెల్లించేందుకు 15రోజులు సమయం ఇచ్చామన్నారు. నిర్ణీత గడువులోగా డబ్బు చెల్లించకపోతే వర్మపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. మరో 200 మంది ఉద్యోగుల అపాయింట్‌మెంట్లను పరిశీలిస్తున్నామని.. 200 మంది ఉద్యోగులను మరికొద్దిరోజుల్లో తొలగింపునకు చర్యలు ఉంటాయన్నారు. ఏపీ ఫైబర్ నెట్‌ను ప్రక్షాళన చేస్తున్నామని ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ జీవీ రెడ్డి స్పష్టం చేశారు.