AP CM Jagan Polavaram Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పోలవరం పర్యటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 6న పోలవరం ప్రాజెక్టును జగన్ సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై అధికారులకు కీలక సూచనలు చేయనున్నారు. సీఎం జగన్ ప్రత్యేక హెలికాప్టర్‌లో అమరావతి నుంచి ఉదయం 10.15 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. ఇప్పటికే అధికారులు పోలవరం ప్రాజెక్టు వద్ద హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్శన సందర్భంగా పోలవరం ప్రాజెక్టు లోయర్, అప్పడర్ కాఫర్ డ్యామ్‌లను ముఖ్యమంత్రి జగన్ పరిశీలించనున్నారు. స్పిల్‌వే, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ ప్రాంతాలను జగన్ సందర్శించనున్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ప్రాజెక్ట్ వద్ద జలవనరులశాఖ అధికారులు, ఇంజినీర్లతో సీఎం సమావేశం కానున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి గురించి తెలుసుకోనున్నారు. వేగంగా పనులు చేపట్టేలా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే జగన్ పర్యటన క్రమంలో శనివారం పోలవరంను జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు సందర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
పోలవరం ప్రాజెక్టు పనులపై జలవనరులశాఖ అధికారులతో మంత్రి అంబటి రాంబాబు సమీక్షించారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డయాఫ్రం వాల్ దగ్గర గోతుల్లో ఇసుక నింపే పనులను అంబటి పరిశీలించారు. ఇటీవల ఢిల్లీలో పోలవరం ప్రాజెక్టు పనులపై కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోలవరం పనులను త్వరగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరుగుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో జాప్యం జరగడానికి గల కారణాలను అధికారులు వివరించారు. ప్రాజెక్టు పనుల కోసం రూ.17 వేల కోట్ల నిధులు విడుదల చేయాలని ఏపీ అధికారులు కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో త్వరలోనే నిధులను విడుదల చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం.
Read Also: Odisha Train Accident: ప్రమాదానికి కారణం ఇదే.. కీలక విషయాలు వెల్లడించిన రైల్వే మంత్రి
ఇదిలా ఉండగా.. ఇటీవల బీజేపీ రాజ్యసభ ఎంపీ పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే పోలవరానికి కేంద్రం నిధులు విడుదల చేయనుందని తెలిపారు. త్వరలో రూ. 12 వేల కోట్లకు పైగా నిధులు పోలవరం కోసం ఇవ్వబోతున్నట్టు వెల్లడించారు.పోలవరం నిర్మాణం కోసం రూ. 12, 911 వేల కోట్లను కేంద్రం ఇవ్వబోతోందని ఆయన తెలిపారు. దీని వల్ల 41.15 ఎత్తులో నీటి నిల్వ చేసుకునేందుకు అవసరమైన నిధులను ఇవ్వబోతోందన్నారు. తొలిదశ పోలవరం నిర్మాణం, ఢయాఫ్రం వాల్ మరమ్మతుల నిమిత్తం రూ. 12,911 కోట్లను కేంద్రం ఇవ్వబోతోందని జీవీఎల్ తెలిపారు. ఇటీవల ఢిల్లీలో సమావేశం జరగడం, త్వరలో పోలవరానికి నిధులు విడుదల కానున్న క్రమంలో ముఖ్యమంత్రి జగన్ పోలవరం పర్యటనకు వెళ్తుండడం చర్చనీయాంశంగా మారింది.