‘ఆడుదాం ఆంధ్ర’ పోటీల ద్వారా అంతర్జాతీయ స్థాయికి మన క్రీడాకారులను పరిచయం చేయడమే లక్ష్యం అని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. గ్రామాల్లోని ఆణిముత్యాలను దేశానికి అందిస్తామని, ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే మైలురాయి అని పేర్కొన్నారు. ఆరోగ్యం సరిగా ఉండాలంటే మన జీవితంలో క్రీడలు అవసరమని, క్రీడలతో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని సీఎం జగన్ చెప్పారు. ఆడుదాం ఆంధ్రా పోటీలను సీఎం జగన్ ప్రారంభించారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులకు సీఎం కిట్‌లను పంపిణీ చేశారు.
‘ఈ క్రీడా సంబురాలు దేశ చరిత్రలోనే ఓ మైలురాయి. నేటి నుండి ఫిబ్రవరి 10 వరకు రాష్ట్రంలో ప్రతి ఊరికి, ప్రతి ఒక్కరికీ పండుగే. గ్రామ గ్రామాలలో ఆరోగ్య అవగాహన కోసం క్రీడలు ప్రాముఖ్యాన్ని తెలియ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అందరూ పాల్గొనే ఓ గొప్ప పండుగ. మంచి ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆరోగ్యం సరిగా ఉండాలంటే.. మన జీవితంలో క్రీడలు అవసరం. క్రీడలతో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. మంచి ఆరోగ్యానికి స్పోర్ట్స్ ఎంతగానో ఉపయోగపడుతాయి. గ్రామస్థాయిలో క్రీడలు ఎంతో అవసరం. అందుకే గ్రామస్థాయి నుంచి అడుగులు వేస్తున్నాం. గ్రామాల్లోని ఆణిముత్యాలను వెతికి దేశానికి అందిస్తాం. గ్రామస్థాయి క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడమే లక్ష్యం’ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
Also Read: Vangaveeti Ranga Death Anniversary: వంగవీటి రంగా వర్ధంతి వేడుకలకు దూరంగా రాధా!
‘గ్రామాల్లో ఆరోగ్యం కోసం ఫ్యామిలీ డాక్టర్ విధానం తీసుకు వచ్చాం. దేశానికి ఫ్యామిలీ డాక్టర్ విధానం ఆదర్శంగా నిలిచింది. గ్రామ, వార్డు సచివాలయం నుంచి రాష్ట్రస్థాయి వరకు క్రీడా పోటీలు నిర్వహించి మట్టిలో మానిక్యాలను వెలికి తీస్తాం. క్రికెట్లో అత్యున్నత ప్రమాణాలు పెంచేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ముందుకు వచ్చింది. పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ వంటి వారి సహకారంతో గ్రామీణ స్థాయిలో కోచింగ్ ఇప్పిస్తాం. ప్రతి ఏటా ఈ తరహా పోటీలు నిర్వహిస్తాం’ అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.