ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగిసిన తరువాత చంద్రబాబు నాయుడు కుప్పం లో పర్యటించబోతున్నారు. కుప్పం నియోజక వర్గంలోని గ్రామ పంచాయతీల్లో అత్యధికభాగం వైసీపి కైవసం చేసుకున్నది. ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కుప్పం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు నాయుడు ఈరోజు నుంచి మూడు రోజులపాటు కుప్పంలో పర్యటించబోతున్నారు. కుప్పం నియోజక వర్గంలోని కార్యకర్తలతో సమావేశం కాబోతున్నారు. దిశానిర్దేశం చేసేందుకు బాబు పర్యటించబోతున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లి, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కుప్పం చేరుకుంటారు. కుప్పంలో శాంతిపురం, రామకుప్పం మండలాల్లో బాబు పర్యటించబోతున్నారు. అయితే, ఈ పర్యటనను అడ్డుకుంటామని వైసీపీ నేతలు చెప్తున్నారు. నిన్నటి రోజున టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు కాల్చివేయడంతో కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది.