CM YS Jagan: మరోసారి హస్తిన పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు.. మూడు రోజుల పర్యటనకు ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం జగన్ వరుసగా రెండోరోజు షెడ్యూల్ బిజీగా సాగింది.. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్‌పై ప్రధానంగా చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచాన వ్యయం నిధులు సహా పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కేంద్ర మంత్రి షెకావత్‌కు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. అరగంట సేపు వీరిద్దరి సమావేశం కొనసాగింది. సీఎం జగన్ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించినట్లు తెలసింది.
ఇక, నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశంలో సీఎం జగన్.. ఆరోగ్యకరమైన పెట్టుబడులు, మౌలిక సదుపాయాల బలోపేతంతో ఆర్థికవ్యవస్థ మరింత వేగంగా పరుగులెడుతోందన్నారు. ఏపీ సాధించిన ప్రగతిపై నీతిఆయోగ్ సమావేశానికి నోట్ ఇచ్చిన సీఎం జగన్.. భారత్‌లో లాజిస్టిక్స్ కోసం పెడుతున్న ఖర్చు జీడీపీలో 14శాతంగా ఉందన్నారు. లాజిస్టిక్స్ ఖర్చు ఎక్కువగా ఉండడంతో.., భారత్ ఉత్పత్తులు ప్రపంచస్థాయిలో పోటీపడేందుకు ప్రతిబంధకంగా మారిందన్నారు. ఏపీ ప్రభుత్వం పోర్ట్ ఆధారిత అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు సీఎం జగన్. ఏపీలో కొత్తగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటవుతున్నాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ మూడేళ్లుగా దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. విలేజ్ క్లినిక్ కాన్సెప్ట్‌ను పూర్తి సామర్థ్యంతో అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం చేపట్టిందన్నారు. దేశ GDPలో తయారీ, సేవల రంగం వాటా 85 శాతం దాటినప్పుడే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుందన్నారు సీఎం జగన్.
తయారీ మరియు సేవల రంగాల వాటా పెరుగుదలను సాధించడానికి పెట్టుబడులు చాలా అవసరం అన్నారు సీఎం జగన్.. దీనికి అనుకూలమైన వ్యాపార వాతావరణం తప్పనిసరి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత మూడేళ్లుగా వరుసగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇంకా, మేము వ్యాపారస్తులకు అత్యంత అనుకూలంగా అనుమతులు సహా తదితర విధానాలను సరళీకృతం చేశాం. వాడుకలో లేని చట్టపరమైన నిబంధనలను సవరించాము మరియు రద్దు చేశాం అన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023కి అద్భుతమైన స్పందన లభించించింది. రూ. 13 లక్షల కోట్లు భారీ పెట్టుబడులకు వివిధ సంస్థలు, కంపెనీలు ముందుకు వచ్చాయి. దీనివల్ల దాదాపు 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పాటవుతున్నాయని వెల్లడించారు.
ప్రజారోగ్యం, పౌష్టికాహారం కూడా చాలా ముఖ్యమని నేను గట్టిగా చెప్పదలచుకున్నాను. పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులు మరియు పెరుగుతున్న NCD (సంక్రమించని దీర్ఘకాలిక వ్యాధుల)ల భారం గురించి మనం తెలుసుకోవాలి సూచించారు సీఎం జగన్.. హృదయ సంబంధ వ్యాధులు మరియు మధుమేహం వంటి అనారోగ్యాలకు సమయానికి చికిత్స అందించకపోతే తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. టెరిషరీ హెల్త్‌కేర్ పేరిట అతిపెద్ద భారానికి దారితీస్తుంది. అందుకనే దీనిపై ఎక్కువగా శ్రద్ధపెట్టాల్సిన అవసరం ఉంది. హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్, పౌష్టికాహారంపై అత్యంత శ్రద్ధపెట్టాలన్నారు.. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 10,592 గ్రామ మరియు వార్డు క్లినిక్‌లను ఏర్పాటు చేసింది, ఇందులో ఒక మిడ్-లెవల్ హెల్త్ ప్రొవైడర్ మరియు ఒక ANMను, ఆశావర్కర్లను అందుబాటులో ఉంచాం. ప్రతి విలేజ్ మరియు వార్డు క్లినిక్‌లో 105 రకాల అవసరమైన మందులు మరియు 14 రకాల డయాగ్నస్టిక్స్ అందుబాటులో ఉన్నాయి. గత రెండున్నర సంవత్సరాల కాలంలో, రాష్ట్రంలో 48,639 మంది వైద్యులు మరియు ఆరోగ్య సిబ్బందిని నియమించింది, విలేజ్ క్లినిక్‌ల నుండి బోధనాసుపత్రుల వరకు అవసరమైన సంఖ్యలో వైద్యులు, నర్సులు మరియు పారామెడిక్స్ ఉండేలా చూసుకున్నామని వెల్లడించారు.