ఏపీని అసని తుఫాన్ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న అసని తుఫాన్ పరిస్థితులపై సీఎం జగన్ అత్యవసర సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి హోంమంత్రి తానేటి వనిత, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వర్చువల్‌గా సీఎం జగన్ సమీక్షిస్తున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు.
ఈ సందర్భంగా తుఫాన్ బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. వారికి ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే ఆదుకోవాలన్నారు. తుఫాన్ బాధితులకు తక్షణమే రూ.2 వేలు పరిహారం చెల్లించాలని అదేశించారు. పరిహారం ఇచ్చే విషయంలో ఎలాంటి సంకోచాలు పెట్టుకోవద్దన్నారు. సెంట్రల్ హెల్ప్ లైన్‌తోపాటు, జిల్లాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లు సమర్థవంతంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. హెల్ప్ లైన్ నంబర్లకు బాగా ప్రచారం కల్పించి వాటికి వచ్చే కాల్స్ పట్ల వెంటనే స్పందించాలని హితవు పలికారు.
అసని తుఫాన్ కంట్రోల్ రూమ్ నంబర్లు: మచిలీపట్నం కలెక్టరేట్: 08672 252572, మచిలీపట్నం ఆర్డీవో ఆఫీస్: 08672 252486, బాపట్ల: 8712655878, 8712655881, ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్: 90103 13920, విశాఖ: 0891-2590100,102, అనకాపల్లి: 7730939383, కాకినాడ కలెక్టరేట్: 18004253077, కాకినాడ ఆర్డీవో ఆఫీస్: 0884-2368100, శ్రీకాకుళం: 08942-240557, తూర్పు గోదావరి: 8885425365, ఏలూరు కలెక్టరేట్: 18002331077, విజయనగరం: 08922-236947, పార్వతీపురం మన్యం: 7286881293.
మరోవైపు అసని తుఫాన్ ప్రభావంతో ఏపీలోని మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం, గంగవరం, భీమునిపట్నం పోర్టులో అధికారులు 7వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని మిగిలిన పోర్టులలో 5వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.