బనకచర్లకు జలాలు తీసుకురావడం తన జీవితాశయం అని, వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పోలవరం జలాలు పారాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్రం సహకారంతో రూ.12,200 కోట్లతో డయాఫ్రం వాల్ పనులు ప్రారంభించాం అని, రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు. పోలవరం నుంచి బనకచర్ల వరకు అనుసంధానం చేస్తే ఒక గేమ్ ఛేంజర్‌గా తయారవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించే బాధ్యత తనదని, పోలవరం నుంచి కృష్ణ నీళ్లు మళ్లిస్తాం అని సీఎం చెప్పారు. ఈరోజు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘ ప్రాజక్టులలో ఉన్న నీటిని సమర్థవంతంగా వాడుకుందాం. కడప జిల్లాను హార్టికల్ హబ్ గా మారుస్తాం. నేను సీఎంగా ఉన్నపుడు 90 శాతం మైక్రో ఇరిగేషన్కు పెద్దపీట వేశా.కడపలో ముఠాలను అణిచివేసిన పార్టీ టీడీపీ. పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడి. ఈ ఏడాది 4వేల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్లాయి. పోలవరం నుంచి 200-300 టీఎంసీల నీళ్లు రాయలసీమకు మళ్ళిస్తున్నాం. అందుకే పోలవరంను పట్టాలెక్కించాం. కేంద్ర సహకారంతో రూ.12,200 కోట్లతో డయాఫ్రం పనులు ప్రారంభించారు. రెండు సంవత్సరాలలో పోలవరం పూర్తి చేస్తాం. పోలవరం నుంచి బనకచర్ల వరకు అనుసంధానం చేస్తే ఒక గేమ్ ఛేంజర్‌గా తయారవుతుంది. బనకచర్లకు నీళ్లు తీసుకురావడం నా జీవిత ఆశయం. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పోలవరం జలాలు పారాలి’ అని అన్నారు.
Also Read: NTR Death Anniversary: ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు.. తెలుగువారి ఆత్మగౌరవం: సీఎం చంద్రబాబు
‘ప్రతి ఎకరాకు సాగునీరు అందించే బాధ్యత నాది. పోలవరం నుంచి కృష్ణ నీళ్లు మళ్లిస్తాం. నల్లమల ఫారెస్టులో ఒక టన్నెల్ నిర్మిస్తే రాయలసీమకు నీళ్లు వస్తాయి. నేను కూడా పుట్టింది రాయలసీమలోనే, సీమ ప్రజల రుణం తీర్చుకుంటా. కరువు రైతు రాష్ట్రంగా మారాలంటే.. నదులు అనుసంధానమే మార్గం. ఒకప్పుడు అసాధ్యం.. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి చేసి చూపిస్తా. కోప్పర్తిని ఒక పారిశ్రామిక కేంద్రంగా తయారు చేస్తా. నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తా. స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై దృష్టి సారిస్తున్నాం. ఈనెల చివరలో వాట్సప్ గవర్ననెన్స్ తీసుకొస్తున్నాం. ఈరోజు ఓపెన్ చేయాల్సి ఉంది కానీ.. కొన్ని అనివార్య కారణాలవల్ల చేయలేకపోయాం. ఫోన్ ద్వారానే అన్ని సేవలు మీకు అందుబాటులోకి తేవడం కోసం కృషి చేస్తున్నాం. కడప ఎయిర్ పోర్టులో రూ.250 కోట్లతో అభివృద్ధి పనులు చేబడతాం. ప్రపంచ వింతల్లో గండికోట చాలా అద్భుతమైనది. గండికోటను అన్ని విధాల అభివృద్ధి చేస్తాం. ఓ పర్యాటక హబ్‌గా తయారు చేస్తాం’ అని సీఎం చెప్పుకొచ్చారు.