CM Chandrababu: పారిశ్రామిక పాలసీ రూపకల్పనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దేశంలో టాప్ 5 రాష్ట్రాలతో పోటీపడేలా కొత్త పారిశ్రామికాభివృద్ధి విధానం ఉండాలని అధికారులను ఆదేశించారు. పాలసీ రూపకల్పనలో నీతి ఆయోగ్ ఆలోచనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. 15 శాతం ఓవర్ ఆల్ గ్రోత్ రేట్ సాధన లక్ష్యంగా నూతన పాలసీని తయారు చేయాలని సూచించారు. పరిశ్రమల స్థాపనలో ఏపీకి ఉన్న బ్రాండ్ ఇమేజీను తిరిగి తీసుకురావాలని.. 100 రోజుల్లోగా పారిశ్రామికాభివృద్ధికి చెందిన ముఖ్య పాలసీలు తీసుకు రావాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Minister Ramprasad Reddy: అమరావతి నిర్మాణానికి మంత్రి విరాళం
ఈనెల 16న పారిశ్రామిక వేత్తలతో సమావేశం జరగనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. 2014-19 కాలంలో ఏపీలో పరిశ్రమల ఏర్పాటులో అన్ని రంగాల్లో ముందంజలో ఉండేదని.. ప్రభుత్వం కల్పించే వివిధ రాయితీలు, మౌలిక సదుపాయాల కల్పన, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాల్లో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉండేదన్నారు. మళ్ళీ అలాంటి పరిస్థితులు కల్పించి పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వంపై ఒక నమ్మకం కలిగే రీతిలో నూతన పారిశ్రామిక విధానం రూపకల్పన చేయాలని సూచించారు. ప్రస్తుతం 53 శాతం రా మెటీరియల్ కింద రాష్ట్రం నుంచి వెళుతున్నాయన్నారు. పిపిపి, పి-4 విధానాలను నూతన విధానంలో పొందుపర్చాలని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు వేగవంతంగా ఇవ్వగలిగితే పరిశ్రమలు త్వరగా ఏర్పాటు అవుతాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని రీతిలో 10 ఓడరేవులు,10 విమానాశ్రయాలు, మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు, లాజిస్టిక్ సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని సీఎం చెప్పుకొచ్చారు.