NTV Telugu Site icon

Chandrababu Arrest: చంద్రబాబును ప్రశ్నించేందుకు రేపు రాజమండ్రికి సీఐడీ బృందం

Chandrababu

Chandrababu

Chandrababu Arrest: స్కిల్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. రెండ్రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు రెండు రోజుల పాటు చంద్రబాబును విచారించనున్నారు. రేపు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించనున్నారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన కస్టడీ మేరకు సీఐడీ విచారణ జరగనుంది. సీఐడీ కస్టడీ నేపథ్యంలో ఏసీబీ కోర్టు నిబంధనలు జారీ చేసింది. విచారణ అధికారుల పేర్లు ఇవ్వాలని, న్యాయవాదుల సమక్షంలో విచారణ చేపట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణకు అనుమతించారు. ప్రతి గంటకు మధ్య ఐదు నిమిషాల విరామం ఇవ్వాలన్నారు. భోజన విరామం గంటసేపు ఉండాలని ఆదేశించారు. విచారణ జరుపుతున్న వీడియో, ఫొటోలు విడుదల చేయరాదని షరతులు విధించారు. విచారణ సందర్భంలో చంద్రబాబు తరఫు న్యాయవాదిని అనుమతించాలన్నారు. చంద్రబాబు కనిపించే విధంగా న్యాయవాది పది మీటర్ల దూరంలో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

Also Read: Botsa Satyanarayana: స్కామ్‌లో వాస్తవాలు తెలుసు కాబట్టే పారిపోతున్నారు..

ఇదిలా ఉండగా.. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబుతో టీడీపీ లీగల్ సెల్ న్యాయవాది లక్ష్మీనారాయణ ములాఖత్‌ అయ్యారు. పలు పిటిషన్లపై చంద్రబాబు సంతకాలను స్వీకరించారు. కోర్టు తీర్పులను చంద్రబాబుకు ఆయన వివరించారు. భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబుతో చర్చించి సలహాలు తీసుకున్నారు. గత వారంలో కూడా చంద్రబాబుతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మీనారాయణ చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏపీ సీఐడీ దాఖలు చేసిన కేసుల విషయమై చంద్రబాబుతో చర్చించారు. లక్ష్మీనారాయణ భేటీ అయిన రోజుల తర్వాత సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్ధ్ లూథ్రా కూడ బాబుతో సమావేశమైన విషయం తెలిసిందే.

Show comments