AP Drone Policy: ఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వెయ్యి కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా డ్రోన్ పాలసీ 2024-29ను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ రూపొందించింది. డ్రోన్ రంగంలో 40 వేల ఉద్యోగాల కల్పన, రూ.3 వేల కోట్ల రాబడి లక్ష్యంగా కేబినెట్ నిర్ణయించింది. ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్‌గా ఏపీ, డ్రోన్ హబ్‌గా ఓర్వకల్లు మారనుంది. 300 ఎకరాల్లో డ్రోన్ తయారీ, టెస్టింగ్, ఆర్ అండ్ డీ ఫెసిలిటీ ఏర్పాటు చేయనున్నారు. 25వేల మందికి డ్రోన్ పైలెట్లుగా శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో 20 రిమోట్ పైలెట్ ట్రైనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 50 డ్రోన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. డ్రోన్ రంగంలో పరిశోధనలు చేపట్టే విద్యాసంస్థలకు 20 లక్షల ప్రోత్సాహం అందించనున్నారు.
Read Also: YSRCP: విజయనగరం స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చిన అప్పలనాయుడు
ఏపీ అన్ని రంగాల్లోనూ గత ప్రభుత్వ హయాంలో వెనుకబడిందని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. డ్రోన్ పాలసీ ద్వారా ఓర్వకల్లును డ్రోన్ల తయారీ హబ్‌గా మార్చాలని నిర్ణయించామన్నారు. రూ.1000 కోట్ల పెట్టుబడి, రూ. 3000 కోట్ల రాబడి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. 25 వేల మందికి ప్రత్యక్షంగానూ, మరో 25 వేల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుందన్నారు. ఇండియా ఒక పెద్ద మార్కెట్ అని.. డేటా సెంటర్లు కావాలన్నారు. బొంబాయి, మద్రాసు, హైదరాబాద్‌లలో డేటా సెంటర్లు పెడుతున్నారన్నారు. హైదరాబాద్ కంటే తక్కువగా భూముల విలువలు ఉన్నా మన రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాలేదని చెప్పారు. ఏపీ డేటా సెంటర్ పాలసీ 4.O కి కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ పాలసీ ద్వారా డేటా సెంటర్ల ఏర్పాటుకు అవకాశాలు ఎక్కువ అవుతాయన్నారు. 2014-19 మధ్యలో ఎలక్ట్రానిక్ మేనుఫ్యాక్చరింగ్ క్లష్టర్లు చంద్రబాబు ఏర్పాటు చేశారని వెల్లడించారు. సెమీ కండక్టర్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ప్రారంభించే వారికి 50% సబ్సిడీ లేదా ఇన్సెంటివ్ ఇస్తామని ప్రకటించారు. చిప్, సెమీకండక్టర్ తయారీకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించవచ్చన్నారు.
గత ఐదేళ్ళలో భూ ఆక్రమణలు ఎక్కువగా జరిగాయని విమర్శించారు. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 ను రిపీల్ చేసి కొత్త చట్టం తీసుకు రావడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఏపీలో ఎలాంటి భూములు అయినా కొత్త చట్టం కిందకు వస్తాయన్నారు. కొత్త చట్టం కింద 10 నుంచీ 14 సంవత్సరాల జైలు, ఆస్తి విలువ, ఆస్తి కూడా పెనాల్టీగా పొందుపరచామన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అమలుకు ప్రత్యేక కోర్టులు తెస్తామన్నారు. ఈ అంశాలపై కలెక్టర్ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయన్నారు.