ఏపీలో బడ్జెట్ సమావేశాలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలను శాసనసభ, శాసనమండలి ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 17న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.2.6 లక్షల కోట్లకుపైగా ఉండనుందని సమాచారం. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి పూర్తి స్థాయి పద్దు ఇదే కానుంది. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఓటాన్ అకౌంట్ పద్దుకే పరిమితం అవుతుంది. ఈ నెల 25 లేదా 27వ తేదీతో ఈ సమావేశాలు ముగిసే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బిల్లులకు ఆమోదం తెలపనుంది. బడ్జెట్లో సంక్షేమంతోపాటు వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.
Also Read:MLC Elections: దొంగ ఓట్ల రాజ్యం.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వరు.. కానీ..
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడంతో.. అందరి దృష్టి నిధుల కేటాయింపుపైనే ఉంది. వచ్చేది ఎన్నికల ఏడాది కావడంతో ఈసారి కేటాయింపులు భారీగానే ఉంటాయని సమాచారం. గత ఏడాది బడ్జెట్ లో మొత్తం 2 లక్షల 56 వేల 256 కోట్ల రూపాయలతో అంచనాలను బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. ఈ సారి సంక్షేమంతో పాటుగా ప్రాధాన్యత రంగాలకు కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. సంక్షేమానికి మరింతగా నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల అంశంపై సీఎం జగన్ మరోసారి ప్రకటన చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా విశాఖే నుంచే పాలన కొనసాగిస్తామని విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ వేదికగా మరోసారి సీఎం జగన్ ప్రకటించారు. అతి త్వరలో విశాఖకు తాను ఫిఫ్ట్ అవుతానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా మరోసారి ప్రకటన చేసే అవకాశం ఉంది. నాలుగేళ్ల పాలనలో మూడు రాజధానులు, సంక్షేమం, విశాఖ గ్లోబల్ సమిట్ వంటి ముఖ్యమైన విషయాలపై జగన్ మాట్లాడే అవకాశం ఉంది.
Also Read:Sajjala: వైసీపీకి ఎప్పటికీ ఓటమి ఉండదు
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విశాఖ నుంచి పాలనపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల వ్యవహారం ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. ఈ నెల 28న సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణకు రానుంది. అయితే, తీర్పు ఎలా ఉన్నా విశాఖ నుంచి సీఎం జగన్ పాలన ప్రారంభించటానికి న్యాయ పరంగా ఎటువంటి అడ్డంకులు లేవని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.