NTV Telugu Site icon

Purandeshwari: మద్యం వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి.. అమిత్‌ షాకు పురంధేశ్వరి ఫిర్యాదు

Amit Shah

Amit Shah

Purandeshwari Met Amit Shah in Delhi: ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కలిశారు. ఏపీలో మద్యం వ్యవహారంపై అమిత్ షాకు పురంధేశ్వరి వివరించారు. ఏపీలో మద్యం అమ్మకాల్లో అవినీతి జరుగుతుందంటూ.. లిక్కర్‌ అవినీతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోం మంత్రిని కోరారు. అమ్ముడవుతున్న కల్తీ మద్యం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా భారీ అవినీతికి మద్యం అమ్మకాన్ని ఉపయోగించుకుంటున్నారని అన్నారు. మద్యం అమ్మకాల ద్వారా ముఖ్యమంత్రితో పాటు ఆయన అనుచరులు కోట్ల రూపాయల కొల్లగొడుతున్నారని ఆమె ఆరోపించారు.

Also Read: Bhuma Akhilapriya: ఎమ్మెల్యే శిల్పా రవిపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఫైర్

మొదట్లో ఆంధ్రప్రదేశ్‌లో వేలం పద్ధతిలో మద్యం దుకాణాలకు అనుమతులు ఉండేవి, ఇప్పుడు ప్రభుత్వమే మద్యం దుకాణాలను రన్ చేస్తుందన్నారు. మద్యం తయారీ నుంచి అమ్మకాల వరకు అవినీతి నెలకొందని, మద్యం తయారీ కంపెనీలను వైసీపీ నేతలే నిర్వహిస్తున్నారని విమర్శించారు. సరైన పద్ధతిలో మద్యం తయారు చేయకపోవడం వల్ల మందు తాగేవాళ్ల ఆరోగ్యం పాడవుతుందని పేర్కొన్నారు. ఒక మద్యం సీసాను 15 రూపాయలకు తయారుచేసి రూ.600 నుంచి రూ.800 వరకు అమ్ముతున్నారని అమిత్‌ షాకు పురంధేశ్వరి ఫిర్యాదు చేశారు.

Also Read: Purandeshwari: ఢిల్లీకి బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి.. పొత్తులపై క్లారిటీ రానుందా?

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం వ్యాపారం నగదు రూపంలోనే జరుగుతుందన్నారు. ఏపీలో ప్రతిరోజు 80 లక్షల మంది మద్యం తాగుతున్నారని.. ఒక్కొక్కరు సరాసరిన 200 రూపాయలు మద్యం కోసం వెచ్చిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఏపీలో లిక్కర్ అమ్మకాల్లో భారీ అవినీతి జరుగుతోందని.. నగదు రూపంలో అమ్మకాలు భారీ అవినీతికి కారణం అవుతోందని ఆమె పేర్కొన్నారు. సంవత్సరంలో మొత్తం రూ.57,600 కోట్లు లిక్కర్ అమ్మకాల ద్వారా వస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ. 32 వేల కోట్లు మాత్రమే చూపిస్తుందని ఆరోపించారు. సంవత్సరానికి 25 వేల కోట్ల భారీ అవినీతి జరుగుతోందని ఆమె ఫిర్యాదు చేశారు. అమాయక ప్రజల జీవితాలను పణంగా పెట్టి భారీగా దోచుకుంటున్నారని అమిత్‌ షాకు అందజేసిన లేఖలో పేర్కొన్నారు.