Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు సెగలు కక్కుతున్నాడు. వాయువ్య భారత్ నుంచి వీస్తున్న ఉష్ణగాలుల ప్రభావానికి రాష్ట్రంలో మరోమారు తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటలకే మంటలు మొదలవుతుండగా.. ఉక్కపోతతో వృద్ధులు, మహిళలు, పిల్లలు అల్లాడుతున్నారు. బయట అడుగుపెట్టాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇంటి నుంచి బయటకు రావట్లేదు. ఒకవేళ బయటకు వచ్చినా.. గొడుగు వెంట బెట్టుకుని వస్తున్నారు. లేకుంటే స్కార్ఫ్, టవల్ వంటి వాటిని ఎండ వేడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు వినియోగిస్తున్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరువగా నమోదైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మరో రెండు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం 135 మండలాల్లో, సోమవారం 276 మండలాల్లో వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. శనివారం పల్నాడు జిల్లా రావిపాడులో 45.6, గుంటూరు జిల్లా మంగళగిరి, తూర్పు గోదావరి జిల్లా పెరవలి, బాపట్ల జిల్లా వేమూరు, మన్యం జిల్లా పెదమేరంగిలో 45.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 14 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 143 మండలాల్లో వడగాడ్పులు వీచినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.
Read Also: CM KCR: నేడు నిర్మల్ కలెక్టరేట్ ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
ఓ వైపు భానుడు సెగలు కక్కుతుండగా..ఏపీలో వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. రాబోయే ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. అలాగే రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలో పలు మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, తీవ్ర వడగాల్పులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు కొన్నిచోట్ల వర్షాలు పడుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపం ఎక్కువగా ఉండటంతో పాటు తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. ఏపీలో రానున్న ఐదు రోజుల పాటు కూడా వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉండనున్నాయి. రానున్న 5 రోజుల్లో అక్కడక్కడ వర్షాలు పడనుండగా.. మరికొన్నిచోట్ల ఎండ ప్రభావంతో పాటు వడగాల్పులు వీయనున్నట్లు వాతావరణశాఖ స్పష్టం చేసింది.
ఆదివారం శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో, 5వ తేదీన నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం జిల్లాల్లో వానలు కరవనున్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది. ఇక 6వ తేదీ కాకినాడ, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలపగా.. 7వ తేదీ అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ జిల్లాలకు, అలాగే 8వ తేదీ పలు జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు వర్షసూచన జారీ చేశారు.