Somireddy Chandra Mohan Reddy: హౌసింగ్ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.3 వేల కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని అసెంబ్లీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రస్తావించారు. సొంతంగా ఇళ్లు కట్టుకోలేని గిరిజన బిడ్డలతో పాటు నిరుపేదలకు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రూ.2.30 లక్షల చొప్పున మంజూరు చేసిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో ఆ మొత్తాన్ని జగన్ రెడ్డి రూ.1.80 లక్షలకు తగ్గించారని.. నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ జగనన్నకాలనీల పేరుతో దుర్మార్గాలకు పాల్పడ్డారన్నారు. భూసేకరణ, లేఅవుట్ల అభివృద్ధితో పాటు ఇళ్ల నిర్మాణంలోనూ భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. బేస్మెంట్లు లేవు, నాణ్యత లేదు.. స్టీలు కనిపించదు.. ఒక ఇంటికి వాడాల్సిన సిమెంటును మూడు, నాలుగు ఇళ్లకు వినియోగించారని చెప్పారు.
READ MORE: US-Colombia Diplomatic Tension: ఆ దేశాధ్యక్షుడి వీసా రద్దు చేసిన అగ్రరాజ్యం!
ఎలాంటి ఫౌండేషన్ లేకుండా నేలపైనే తూతూమంత్రగా బేస్మెంట్లు కట్టారని.. సిట్ తో సమగ్ర విచారణ జరిపించి అక్రమాలను నిగ్గు తేల్చాలని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. “నా నియోజకవర్గంలో అత్యంత నాసిరకంగా జరిగిన నిర్మాణాలను సాక్షాత్తు హౌసింగ్ మంత్రి పార్థసారథి స్వయంగా చూశారు. ఆప్షన్ -3లో చేపట్టిన ఇళ్లలో పేద కుటుంబాలు బిడ్డాపాపలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన భయానక పరిస్థితి. కాంట్రాక్టర్లపై కేసులు పెట్టి, వారి మెడలు వంచి రికవరీ చేయాలి…తిరిగి వారి చేతే పేద కుటుంబాలకు నాణ్యతతో కూడిన ఇళ్లు కట్టించాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి ఇంటికి మన సీఎం చంద్రబాబు నాయుడు అదనంగా రూ.75 వేలు వరకు మంజూరు చేశారు. ఒక్కో యూనిట్ కు రూ.1.80 లక్షల నుంచి రూ.2.55 లక్షలకు పెంచారు. ఆప్షన్ -3లోని నిరుపేదల ఇళ్లను దోపిడీ వనరుగా మార్చుకున్నారు…బేస్మెంట్ లెవల్ లోనే భారీగా దోపిడీకి పాల్పడ్డారు. రూ.53 వేలుగా ఉన్న బేస్మెంట్ లెవల్ బిల్లును రోజుల వ్యవధిలో రూ.70 వేలకు పెంచేశారు. సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి గతంలో ఈ దోపిడీ అంశాన్ని తీసుకెళ్లగానే నెల్లూరు జిల్లాకు సంబంధించి విజిలెన్స్ తో విచారణ చేయించారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే రూ.100 కోట్ల అవినీతి జరిగినట్లు తేలింది. నాణ్యత విషయంలో కూడా విచారణ చేస్తే మరో రూ.100 కోట్ల అక్రమాలు బయటపడుతాయని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. ఒక్క నెల్లూరు జిల్లాలో రూ.200 కోట్లు దుర్వినియోగమైతే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థాయిలో జరిగివుంటుందో అర్థం చేసుకోవచ్చు.” అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆప్షన్ -3 హౌసింగ్ స్కామ్ పై సిట్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల ముక్కు పిండి దోపిడీ చేసిన సొత్తును కక్కించడంతో పాటు గొంతు కత్తి పెట్టి అయినా నిరుపేదలకు నాణ్యతతో కూడిన ఇళ్లు కట్టించాలని కోరారు.