Site icon NTV Telugu

Top Headlines @1PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

మోడీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ అంత్యక్రియలు పూర్తి

ప్రధాని నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ అశ్రునయనాలతో తన తల్లి పాడె మోశారు. అంతిమ యాత్ర వాహనంలో తల్లి పార్థివ దేహం వద్ద కూర్చుని ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ శుక్రవారం శివైక్యం చెందారు. అస్వస్థతతో అహ్మదాబాద్‌లోని యూఎన్‌ మెహతా హాస్పిటల్‌లో చేరిన ఆమె.. చికిత్స పొందుతూ కన్నుమూశారు.అనంతరం గాంధీనగర్‌లోని ముక్తిధామ్‌ శ్మశానవాటికిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హీరాబెన్ మోదీ చితికి నిప్పంటించి ప్రధాని మోదీ అక్కడి నుంచి వెనుదిరిగారు.  హిరాబెన్ అంతిమయాత్రకు కుటుంబసభ్యులతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతకుముందు గాంధీనగర్‌లోని నివాసంలో తన తల్లి పార్ధీవ దేహానికి పుష్పాంజలి ఘటించారు మోదీ. కడసారి నివాళులు అర్పించారు. ఇటీవలే 100వ పుట్టినరోజు జరుపుకొన్న హీరాబెన్ మోదీ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం గుజరాత్ అహ్మదాబాద్‌లోని యూఎన్‌ మెహతా ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి కన్నుమూశారు. తన తల్లి మరణించిన విషయాన్ని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు

జ్యుడీషియల్ అకాడమీని ప్రారంభించిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్

న్యాయాధికారుల శిక్షణ కోసం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కాజ వద్ద ఏర్పాటు చేసిన ఏపీ జ్యుడీషియల్ అకాడమీని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జ్యుడిషియల్‌ అకాడమీ ప్యాట్రన్‌ ఇన్‌ చీఫ్‌, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జ్యుడిషియల్‌ అకాడమీ అధ్యక్షులు, బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్లు(హైకోర్టు న్యాయమూర్తులు) తదితరులు పాల్గొన్నారు. నూతన సాంకేతికతకు అనుగుణంగా మార్పులు చేసుకోవడం ముఖ్యమని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. న్యాయవ్యవస్థలో వేగంగా సేవలు అందించాలంటే మౌలిక వసతులను మెరుగుపరచాలన్నారు. న్యాయవ్యవస్థలో టెక్నాలజీ కూడా అంతర్భాగమైందని ఆయన వెల్లడించారు. న్యాయమూర్తులు నిత్య విద్యార్థులుగా ఉంటూ నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కోర్టులు వివాదాల పరిష్కారమే కాదు న్యాయాన్ని నిలబెట్టేలా ఉండాలన్నారు.

సీఎం జగన్ కి మరో లేఖ రాసిన ముద్రగడ

తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. సీఎం జగన్ కి ముద్రగడ పద్మనాభం మరో లేఖ రాశారు. ఈ లేఖలో అనేక అంశాలు ప్రస్తావించారు. ఎవరి ప్రమేయం లేకుండా దళితులు వారి పదవులకు వారే ఓటు వేసుకునే విధానంలో ఆలోచన చేయాలి. కొన్ని పదవులలోనైనా దళితులకు పూర్తి స్వేచ్ఛ ఇప్పించాలి. దళిత నాయకులతో సమావేశం పెట్టి వారి సలహాలు తీసుకుని ముందుకు వెళితే బాగుంటుంది. కొందరు దళితులు ఇతర వర్గాలు నివసించే ప్రాంతాలలో ఉండడం వల్ల లక్షలాది రూపాయలు నిధులు వారి పేరుతో ఖర్చు చేయడం వల్ల ఎక్కువ జనాభా నష్టపోతున్నారు. నాలుగు రోజులు వ్యవధి లో సీఎం జగన్ కి ముద్రగడ పద్మనాభం రెండు లేఖలు రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

విజయవాడలో మూడుకోట్ల విలువైన గంజాయి దగ్ధం

ఈమధ్యకాలంలో గంజాయి విచ్చలవిడిగా పట్టుబడుతోంది. వివిధ కేసులలో పట్టుబడిన సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన అక్రమ గంజాయిని దహనం చేశారు ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు. గురువారం ఉదయం కంచికచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిటాల గ్రామం, దొనబండ క్వారీ రోడ్ నందు గంజాయిని దగ్ధం చేశారు. ఎన్. టి. ఆర్.జిల్లాలోని కంచికచెర్ల, వన్ టౌన్, సత్యనారాయణపురం, అజిత్ సింగ్ నగర్, ఇబ్రహీంపట్నం , గుణదల మరియు పటమట పరిధిలోని పోలీస్ స్టేషన్లలో గత కొంత కాలంగా అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన 18 కేసులలో సుమారు మూడు కోట్ల రూపాయల విలువగలిగిన 7459 కేజీ ల గంజాయిని దహనం చేశామని పోలీసులు తెలిపారు.ఈ సందర్బంగా నగర పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా వివరాలు అందచేశారు. గంజాయి సాగు,అక్రమ రవాణాను అరికట్టే దిశగా అపరేషన్ పరివర్తన్ కార్యక్రమాన్ని పోలీస్ శాఖ చేపట్టిన సంగతి అందరికీ విదితమే. రాష్ట్ర డి.జి.పి. KV రాజేంద్రనాధ్ రెడ్డి ఆదేశాలతో దాడులు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకై పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. గంజాయి నిషేధిత పదార్థం,గంజాయిని అక్రమ రవాణా చేసినా, వినియోగించిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బిజినెస్ మెన్ కిడ్నాప్ కు యత్నం.. రాజేంద్రనగర్ లో కలకలం
ఈమధ్యకాలంలో నేరాలు పెరిగిపోతున్నాయి. ఈజీ మనీ కోసం ఏం చేయడానికి వెనుకాడడం లేదు కొందరు కేటుగాళ్ళు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో వ్యాపారవేత్త కిడ్నాప్ కు విఫలయత్నం చేశారు. హీరో షోరూమ్ యజమాని సాయి కిరణ్ కు మత్తు మందు ఇచ్చి కారు లో కిడ్నాప్ కు ప్రయత్నించారు దుండగులు.. కిస్మత్ పూర్ కు చెందిన వ్యాపారవేత్త తన కారు లో షో రూమ్ కు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో కిస్మత్ పూర్ బ్రిడ్జ్ దాటగానే వాష్ రూమ్ కని కారు ఆపాడు కారు డ్రైవర్. ఒక్కసారిగా కారు లోకి ఎక్కిన ముగ్గురు సభ్యుల తో కూడిన గ్యాంగ్. సాయి కిరణ్ కు మత్తు మందు ఇచ్చి మాస్క్ పెట్టారు కిడ్నాపర్లు. కారు స్టార్ట్ చేసి అత్తాపూర్ వైపు కారును పోనిచ్చిన డ్రైవర్. డెయిరీ ఫామ్ వద్దకు రాగానే తేరుకోని కారులో నుండి కింద కు దూకేశారు సాయి కిరణ్. హుటాహుటిన 100 డయల్ చేసి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు పరుగులు తీశాడు సాయి కిరణ్. జరిగిన సంగతి పోలీసులకు వివరించాడు. వెంటనే రంగంలోకి దిగారు పోలీసులు. చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాపర్స్ ను పట్టుకుంది శంషాబాద్ ఎస్ఓటి బృందం. మరి కాసేపట్లో కిడ్నాపర్స్ ను మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు పోలీసులు. సాయి కిరణ్ ను కిడ్నాప్ చేసి డబ్బులు లాగుదామనుకున్నారు కిడ్నాపర్స్. అయితే, ఆ ప్లాన్ ను భగ్నం చేశారు పోలీసులు.

భారత్‌ జోడో యాత్రలో పాల్గొనాలంటూ స్మృతి ఇరానీకి ఆహ్వానం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో పాల్గొనాలంటూ కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీకి ఆహ్వానం అందింది. బీజేపీ నేతకు ఆహ్వానం అందడం ఏమిటని అనుకుంటున్నారా.. ఆహ్వానం అందడం నిజమేనండోయ్‌. ఉత్తరప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నేత దీపక్ సింగ్ కేంద్ర మంత్రిని జోడో యాత్రలో పాల్గొనాలంటూ ఆహ్వానించారు. ఈమేరకు గౌరిగంజ్ లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో స్మృతి ఇరానీ కార్యదర్శి నరేశ్ శర్మకు లేఖ అందించారు. అమేథీ బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీకి లేఖ రాశానని, రాష్ట్రంలో రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రలో చేరాల్సిందిగా ఆమెను ఆహ్వానిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ఎమ్మెల్సీ దీపక్ సింగ్ గురువారం తెలిపారు. బుధవారం గౌరీగంజ్‌లోని ఆమె క్యాంపు కార్యాలయంలో ఇరానీ కార్యదర్శి నరేష్ శర్మకు ఆహ్వానాన్ని అందజేసినట్లు సింగ్ తెలిపారు.

సినీ నటి శారద చాక్లెట్ కంపెనీ రిలయెన్స్ చేతికి
సీనియర్‌ మోస్ట్‌ సినీ నటి శారద మరియు విజయ రాఘవన్‌ నంబియార్‌ సంయుక్తంగా 1988వ సంవత్సరంలో ప్రారంభించిన లోటల్‌ చాక్లెట్‌ కంపెనీని.. రిలయెన్స్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ సంస్థ కొనుగోలు చేసింది. ఈ చాక్లెట్‌ కంపెనీ ప్రస్తుతం సింగపూర్‌ సంస్థ సన్‌షైన్‌ అలైడ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి అనుబంధంగా.. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తోంది. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా దౌలతాబాద్‌లో యూనిట్‌ కలిగిన ఈ కంపెనీలో మెజారిటీ వాటాను.. అంటే.. 51 శాతం షేరును రిలయెన్స్‌ సొంతం చేసుకుంది. ఒక్కో షేరుకు 113 రూపాయల చొప్పున మొత్తం 74 కోట్ల రూపాయలు చెల్లించనుంది. బ్యాంకులకు మొండి బకాయిలు భారీగా తగ్గాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. స్థూల నిరర్థక ఆస్తులు ఏడేళ్ల కనిష్టానికి దిగొచ్చాయని 26వ ఆర్థిక స్థిరత్వ నివేదికలో పేర్కొంది. గ్రాస్‌ నాన్‌ పెర్‌ఫామింగ్‌ అసెట్స్‌ 5 శాతానికి.. నెట్‌ ఎన్‌పీఏలు పదేళ్ల కనిష్టానికి కరిగి.. ఒకటీ పాయింట్‌ 3 శాతానికి చేరాయని వెల్లడించింది. సెప్టెంబర్‌ వరకు అందుబాటులో ఉన్న ఈ వివరాలను నిన్న గురువారం విడుదల చేసిన రిపోర్ట్‌లో పొందుపరిచింది. దేశంలోని బ్యాంకుల్లో మూలధన నిల్వలు తగినంతగా ఉన్నాయని, ఆర్థిక మాంద్యం లాంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా తట్టుకోగలవని ధీమా వ్యక్తం చేసింది.

కంబోడియా-థాయ్‌లాండ్ బోర్డర్ క్యాసినోలో ఫైర్.. 19 మంది మృతి

కంబోడియా-థాయ్‌లాండ్ సరిహద్దులోని క్యాసినో కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 19 మంది మరణించగా.. 60 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. బుధవారం అర్ధరాత్రి థాయ్‌లాండ్‌, కంబోడియా సరిహద్దు నగరమైన పాయ్‌పట్‌లోని గ్రాండ్‌ డైమండ్‌ హోటల్‌ క్యాసినోలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది.ఆ సమయంలో అక్కడ 1,000 మంది సందర్శకులు, 500 మంది ఉద్యోగులు ఉన్నారని తెలుస్తోంది. ఈ ఘటనలో క్యాసినో 12 గంటల పాటు మంటల్లోనే చిక్కుకుని ఉంది. అగ్నిమాపక సిబ్బంది గురువారం మధ్యాహ్నానికి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కంబోడియన్ అధికారుల నుంచి వచ్చిన అత్యవసర కాల్‌లకు ప్రతిస్పందించిన థాయ్ పోలీసులు స్పందించి చాలా మందిని రక్షించారు. సుమారు 700 మంది థాయ్ పౌరులు రక్షించబడ్డారు. గాయపడిన వారిని థాయ్‌లాండ్‌లోని ఆసుపత్రులకు తరలించారు.

Exit mobile version