Site icon NTV Telugu

AP Gram Panchayats: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన!

Ap Govt

Ap Govt

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో త్వరలో ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి రానుంది. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక అధికారుల నియామక బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని మెజారిటీ గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీకాలం పూర్తయిన మరుసటి రోజు నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి రానుంది. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారి, పర్సన్-ఇన్-ఛార్జ్ లేదా పర్సన్-ఇన్-ఛార్జ్ కమిటీని నియమించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అవసరాన్ని బట్టి ఒక గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేక అధికారిని లేదా పలు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక అధికారిని నియమించే అధికారం జిల్లా కలెక్టర్లకు ఇవ్వబడింది.

Also Read: IPL 2026-SRH Schedule: ఆర్‌సీబీతో తొలి మ్యాచ్.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్ షెడ్యూల్‌ ఇదే!

ఈ పదవులకు తహశీల్దార్, ఎంపీడీవో, ఎంఈవో, డిప్యూటీ ఎంపీడీవో లేదా అంతకంటే ఉన్నత హోదా కలిగిన అధికారులను నియమించాలని ప్రభుత్వం సూచించింది. గ్రామ పంచాయతీకి సంబంధించిన అధికారాలను వినియోగిస్తూ విధులు నిర్వహించేందుకు వీలుగా ఈ ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. గ్రామ పంచాయతీలకు కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించే వరకు ఈ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. ఈ నిర్ణయానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ అధికారికంగా జారీ చేశారు.

Exit mobile version